35 ఏళ్ల తర్వాత అన్నను కలిపిన ఓటర్ జాబితా..SIR ప్రక్రియలో ఊహించని అద్భుతం

ప్రభుత్వ పత్రం కోసం వెళ్లిన ఓ వ్యక్తికి అనూహ్యంగా తన అన్న ఎదురయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములను ఓటర్ జాబితా పరిశీలన ప్రక్రియ మళ్లీ కలిపింది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

5 సెప్టెంబర్, 2026 8:01 PM•ByNarender Kumar Nangunoori

Share this article

35 ఏళ్ల తర్వాత అన్నను కలిపిన ఓటర్ జాబితా..SIR ప్రక్రియలో ఊహించని అద్భుతం

Social Media Image

హరియాణాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఓ ఇద్దరు అన్నదమ్ములను 35 ఏళ్ల తర్వాత కలిపింది. ప్రభుత్వ పత్రం కోసం పాత స్కూల్ సర్టిఫికెట్ తీసుకునేందుకు వచ్చిన సీతారామ్‌కు ఊహించని విధంగా తన అన్న దల్బీర్ సింగ్ కనిపించారు. జింద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో సీతారామ్ గత 35 ఏళ్లుగా నివసిస్తున్నారు. SIR ప్రక్రియలో తన వివరాలను ధ్రువీకరించుకోవడానికి పాత విద్యా ధ్రువపత్రం అవసరం కావడంతో హరియాణాలోని జింద్ జిల్లా మానోహర్‌పూర్‌లో తాను చదువుకున్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌కు వెళ్లారు. సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తున్న సమయంలో బూత్ లెవల్ అధికారి సీతారామ్‌ను కొన్ని వివరాలు అడిగారు. తన గ్రామం మానోహర్‌పూర్ అని, తన అన్న పేరు దల్బీర్ సింగ్ అని ఆయన తెలిపారు. అయితే, ఆ అధికారికి దల్బీర్ వ్యక్తిగతంగా పరిచయం ఉండటంతో పాటు ఆయన ఫోన్ నంబర్ కూడా ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అధికారి చొరవతో 35 ఏళ్లుగా ఒకరికి ఒకరు దూరంగా ఉన్న అన్నదమ్ములు చివరకు కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాన్ని చూసిన స్కూల్ సిబ్బంది, అక్కడున్న ఇతరులు కూడా చలించిపోయారు.

అసలు ఏం జరిగింది?

సీతారామ్ చిన్న వయసులోనే కుటుంబానికి దూరమయ్యారు. ఆయన చిన్నతనంలో పోలియో బారిన పడటంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు పంజాబ్‌కు తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడ కొంతకాలం చికిత్స కోసం ఉంచారు. అయితే కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లే సమయానికి సీతారామ్ అక్కడ కనిపించలేదు. కుటుంబ సభ్యులు చాలా కాలం ఆయన కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. బంధువులు, పరిచయస్తులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు సీతారామ్ మాత్రం పంజాబ్‌లోనే ఉండిపోయారు. పంజాబ్‌లో వివిధ పనులు చేస్తూ జీవనం సాగించిన ఆయన ఓ ప్రైవేట్ స్కూల్‌లో ప్యూన్‌గా పనిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. ఇలా కాలం గడిచిపోయింది. ఇటీవల SIR ప్రక్రియలో భాగంగా తన వివరాలను ధ్రువీకరించుకోవాల్సి రావడంతో పాత విద్యా ధ్రువపత్రం అవసరమైంది. అందుకోసం 35 ఏళ్ల తర్వాత సొంత గ్రామానికి, తాను చదువుకున్న పాఠశాలకు తిరిగి వచ్చిన సీతారామ్‌కు అక్కడే తన అన్నయ్య దల్బీర్ సింగ్‌ ను కలిసాడు.

ఓటర్ జాబితా వెరిఫికేషన్ కోసం మొదలైన ప్రయాణం.. చివరకు 35 ఏళ్ల కుటుంబ బంధాన్ని తిరిగి కలిపింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు