భోపాల్,అక్టోబర్ 3 (జనవాణి): భారత న్యాయ వ్యవస్థలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కేసులకు కొత్త క్రిమినల్ చట్టాలతో వేగంగా పరిష్కారం లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కొత్త చట్టాలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తుది తీర్పు వరకు న్యాయ ప్రక్రియ గరిష్టంగా మూడేళ్లలో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శనివారం జరిగిన పాడి రైతుల రాష్ట్ర స్థాయి సదస్సులో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
మరో ఏడాదిన్నరలో పూర్తి స్థాయి అమలు
దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు మరో ఏడాదిన్నరలో వంద శాతం అమల్లోకి వస్తాయని అమిత్ షా తెలిపారు. ఆ తర్వాత ఏ క్రిమినల్ కేసు అయినా ఎఫ్‌ఐఆర్ దశ నుంచి సుప్రీంకోర్టు వరకు గరిష్టంగా మూడేళ్లలో పరిష్కారమయ్యేలా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. కొత్త చట్టాల అమలుతో భారత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక వ్యవస్థల్లో ఒకటిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
శిక్ష కంటే బాధితులకు వేగంగా న్యాయం
బ్రిటిష్ పాలనలో రూపొందించిన పాత క్రిమినల్ చట్టాలు వారి పాలన, ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడుకునేలా ఉండేవని అమిత్ షా వ్యాఖ్యానించారు. దీనికి భిన్నంగా కొత్త చట్టాలు భారత పౌరుల ఆత్మగౌరవం, హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా రూపొందించామని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రధాన ఉద్దేశం కేవలం నేరస్థులకు శిక్ష విధించడం కాదని, బాధితులకు వేగంగా న్యాయం అందించడమేనని అమిత్ షా స్పష్టం చేశారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైన చోట కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు.
పాడి పరిశ్రమపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
పాడి పరిశ్రమ అభివృద్ధిపై కూడా అమిత్ షా మాట్లాడారు. రైతుల కోసం ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని తెలిపారు.
2014-15 నాటికి దేశంలో పాల ఉత్పత్తి సుమారు 14.7 కోట్ల టన్నులు ఉండగా, గత పదేళ్లలో అది 25 కోట్ల టన్నులకు చేరిందని అమిత్ షా వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పశువుల బ్రీడింగ్‌ను మెరుగుపరచడంతో పాటు, పశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047 ఆగస్టు 15 నాటికి భారత్‌ను అన్ని రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు.




















