అయోధ్య రామాలయానికి తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

అయోధ్య రామమందిరం నిర్వహణ, పరిపాలనకు కీలక అడుగు పడింది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,585 దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆయనను ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక చేశారు.

2 సెప్టెంబర్, 2026 5:58 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అయోధ్య రామాలయానికి తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

Social Media Image

అయోధ్య, సెప్టెంబర్ 02 (జనవాణి): అయోధ్య రామమందిరం నిర్వహణ, పరిపాలనను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను రామాలయ ట్రస్ట్ తొలి సీఈవోగా నియమించింది. ఈ మేరకు బుధవారం ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది.

రామమందిరం సీఈవో పదవి కోసం దేశవ్యాప్తంగా దాదాపు 5,585 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ దరఖాస్తులను పరిశీలించి ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసింది. తుది ఎంపికలో జితేంద్ర మిశ్రా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. జితేంద్ర మిశ్రా మూడేళ్ల పాటు సీఈవోగా కొనసాగనున్నారు. ఈ కాలంలో ఆయన అయోధ్యలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. రామమందిరం రోజువారీ పరిపాలన, ట్రస్ట్ నిర్ణయాల అమలు, సిబ్బంది పర్యవేక్షణతో పాటు ఆలయ సముదాయం సజావుగా పనిచేసేలా చూడటం ఆయన ప్రధాన బాధ్యతలు.

39 ఏళ్ల వైమానిక దళ అనుభవం

జితేంద్ర మిశ్రా ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవిరియా జిల్లాలోని భోపత్‌పురా గ్రామానికి చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి లెక్చరర్‌గా పనిచేశారు. జితేంద్ర మిశ్రాకు భారత వైమానిక దళంలో 39 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 1986 డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో చేరిన ఆయన.. వివిధ కీలక విభాగాల్లో సేవలందించారు. ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు సహా 18కి పైగా రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆయనకు ఉంది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లోనూ జితేంద్ర మిశ్రా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వెస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు. అంతకుముందు ఆపరేషన్ టైగర్ హిల్, ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ఎయిర్ మార్షల్ హోదాలో సేవలందించిన జితేంద్ర మిశ్రా 2026 ఏప్రిల్ 30న భారత వైమానిక దళం నుంచి పదవీ విరమణ చేశారు. తాజాగా అయోధ్య రామమందిరం తొలి సీఈవోగా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు