బెంగళూరు,సెప్టెంబర్ 24 (జనవాణి): ఒక ఉద్యోగి చేసిన తప్పిదం నేపథ్యంలో బెంగళూరుకు చెందిన A1 స్పోర్ట్స్ వరల్డ్ స్టార్టప్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఇకపై తమ సంస్థలో నియమించుకోబోమని కంపెనీ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా కార్తీక్ వెల్లడించారు. కొన్ని వారాల క్రితం తమ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, ఓ సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. ఆ ఉద్యోగి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకదానికి చెందినవాడని పేర్కొంటూ.. “ఇలాంటి మనస్తత్వం ఉన్న పురుషులకు అవకాశం ఇవ్వాలా?” అని ప్రశ్నించారు.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, సంస్థలోని కీలక నిర్ణయాధికారులతో సుదీర్ఘ చర్చలు, వాగ్వాదాల అనంతరం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు కార్తీక్ తెలిపారు. తమ సంస్థలో ఇప్పటికే రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగి పనిచేస్తున్నారని, ఆమె కూడా ఈ నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలిపిందని పేర్కొన్నారు.
అయితే, ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక ఉద్యోగి చేసిన తప్పుకు మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఉద్యోగాలకు దూరంగా ఉంచడం ప్రాంతీయ వివక్షకు దారితీస్తుందంటూ పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
విమర్శలు వెల్లువెత్తడంతో కార్తీక్ మరోసారి వివరణ ఇచ్చారు. తమ సంస్థలో మొత్తం 32 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 14 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, మతాలకు చెందిన వారు తమ సంస్థలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు చెబుతున్నప్పటికీ, ఒక వ్యక్తి చర్యకు మొత్తం నాలుగు రాష్ట్రాల యువతను బాధ్యులను చేయడం సమంజసమేనా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ నియామకాల్లో ప్రాంతం ఆధారంగా ఇలాంటి నిబంధన విధించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Loading Tweet...
Loading Tweet...




















