బెంగళూరు,సెప్టెంబర్ 24 (జనవాణి): బెంగళూరు.. దేశంలోని అతిపెద్ద ఐటీ హబ్‌లలో ఒకటి. అయితే నగర జీవనంలో ట్రాఫిక్ సమస్య మాత్రం పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఆఫీస్ వేళల్లో రోడ్లపై గంటల తరబడి గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు నగరవాసులు వినూత్న ప్రయాణ మార్గాల వైపు ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా ఒకే చక్రం ఉండే ఎలక్ట్రిక్ యూనిసైకిల్స్ (EUCs) బెంగళూరు రోడ్లపై కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీవాలా బెంగళూరులో ఈ యూనిసైకిల్ రైడర్లను గుర్తించి, వారితో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
గంటకు 70 కి.మీ స్పీడ్!
వీడియోలో ఓ యూనిసైకిల్ రైడర్‌ను షెనాజ్ దాని వేగం గురించి అడిగారు. దీనికి ఆ రైడర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని తెలిపారు. ఆఫీస్‌కు వెళ్లేందుకు, మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు కొందరు దీన్ని ఉపయోగిస్తున్నారని చెప్పారు. అంతేకాదు యూనిసైకిల్‌ను సులభంగా మెట్రోలోకి కూడా తీసుకెళ్లవచ్చని తెలిపారు. కొంతమంది రైడర్లు ఈ వాహనాలపై దేశవ్యాప్తంగా ప్రయాణాలు కూడా చేసినట్లు వెల్లడించారు.
మరో రైడర్ మాట్లాడుతూ.. రోడ్లపై ప్రయాణించడంతో పాటు పర్వత ప్రాంతాలు, బీచ్‌లు, మెట్లు ఎక్కడానికీ యూనిసైకిల్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రయాణించడం ప్రత్యేకమైన థ్రిల్‌ను ఇస్తుందని వివరించారు.
రూ.50 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు ధర
ఈ ఎలక్ట్రిక్ యూనిసైకిల్స్ ధర మోడల్, సామర్థ్యాన్ని బట్టి సుమారు రూ.50,000 నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని రైడర్లు తెలిపారు. ఇక వీటిని నేర్చుకోవాలనుకునేవారి కోసం ప్రతి ఆదివారం ప్రత్యేకంగా కమ్యూనిటీ సెషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారికి యూనిసైకిల్ నడపడం నేర్పిస్తున్నట్లు వెల్లడించారు.
5 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు!
ఈ వాహనాన్ని ఎవరు నడపగలరని షెనాజ్ ప్రశ్నించగా తమ గ్రూప్‌లో ఐదేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు యూనిసైకిల్ నడిపేవారు ఉన్నారని రైడర్లు తెలిపారు. పెట్రోల్ ఖర్చు లేకపోవడం, పార్కింగ్ సమస్య ఉండకపోవడం, ట్రాఫిక్‌లో ఎక్కువసేపు చిక్కుకోకపోవడం వంటి అంశాలను ఈ వాహనం ఉపయోగించే వారు ప్రధాన ప్రయోజనాలుగా చెబుతున్నారు.
అయితే, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. యూనిసైకిల్ చూడటానికి ఆసక్తికరంగా ఉందని కొందరు కామెంట్లు చేస్తుండగా రోడ్లపై గుంతలు, ఇతర వాహనాల రద్దీ వంటి పరిస్థితుల్లో భద్రతపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వంటి భారీ ట్రాఫిక్ ఉన్న నగరంలో ఈ సింగిల్-వీల్ ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త ప్రయాణ ట్రెండ్‌గా మారుతున్నాయి. అయితే వీటిని రోడ్లపై ఉపయోగించేటప్పుడు వేగం, రహదారి పరిస్థితులు, భద్రతా నియమాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.




















