చిత్రకూట్‌ను ముంచెత్తిన వరదలు.. ఉగ్రరూపంలో మందాకిని నది

ఉత్తరప్రదేశ్–మధ్యప్రదేశ్ సరిహద్దులోని చిత్రకూట్, సత్నా జిల్లాలను భారీ వరదలు ముంచెత్తాయి. మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో చిత్రకూట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. వరద బాధితులను రక్షించేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.

30 ఆగస్టు, 2026 4:57 PM•ByNarender Kumar Nangunoori

Share this article

చిత్రకూట్‌ను ముంచెత్తిన వరదలు.. ఉగ్రరూపంలో మందాకిని నది

Social Media Image

చిత్రకూట్, ఆగస్టు 30 (జనవాణి): ఉత్తరప్రదేశ్–మధ్యప్రదేశ్ సరిహద్దులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిత్రకూట్‌లో మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

మందాకిని నదిలో నీటిమట్టం గణనీయంగా పెరగడంతో ప్రముఖ రామ్ ఘాట్, నిర్మోహి అఖడాతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు శనివారం సాయంత్రం రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్రకూట్ జిల్లా మేజిస్ట్రేట్ పుల్కిత్ గార్గ్ సూచించారు. నది తీరాలు, ఘాట్ల వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. మరోవైపు మూడు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి.

సత్నాలోనూ వరద బీభత్సం

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోనూ భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. కేవలం మూడు గంటల వ్యవధిలో నది పరివాహక ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రాత్రివేళల్లోనూ సహాయక చర్యలు చేపట్టి జిల్లావ్యాప్తంగా 350 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సత్నా కలెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. రేవా, సత్నా జిల్లాల్లో వరద పరిస్థితులపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఆహారం, దుస్తులు, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సత్నా జిల్లాలోని ముఖర్ బిందు పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.

భారీ వర్షాల కారణంగా చిత్రకూట్, సత్నా జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయని సీఎం తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు, అధికారుల అప్రమత్తత కారణంగా ప్రాణనష్టం తప్పిందన్నారు. అయితే వరదలు గత రికార్డులను అధిగమించాయని పేర్కొన్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం మోహన్ యాదవ్ సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రధానంగా సహాయక, పునరావాస చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు