హర్యానా,సెప్టెంబర్ 18 (జనవాణి): హర్యానా సోనిపట్‌లో పిట్‌బుల్ దాడి కలకలం రేపింది. సిక్కా కాలనీలో తల్లి చేతుల్లో ఉన్న ఆరు నెలల పసికందుపై ఓ పిట్‌బుల్ అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాలనీలో ఓ మహిళ తన ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని బయట నిల్చొని ఉండగా పిట్‌బుల్ ఒక్కసారిగా ఆమెపైకి దూసుకొచ్చింది. దీంతో తల్లీబిడ్డ ఇద్దరూ కిందపడిపోయారు. అనంతరం కుక్క చిన్నారిని నోట కరుచుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. స్థానికులు కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించినా అది చిన్నారిని వదిలిపెట్టలేదు.
కుక్క దాడిలో పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహ్తక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిట్‌బుల్, రాట్‌వైలర్ వంటి శక్తిమంతమైన కుక్కలను ఇళ్లలో పెంచుకునే సమయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న డిమాండ్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఇదే తరహాలో గతంలో ఢిల్లీలోని వినయ్ ఎన్‌క్లేవ్‌లోనూ పిట్‌బుల్ దాడి ఘటన నమోదైంది. ఆ ఘటనలో ఆరేళ్ల బాలుడి కుడి చెవిలో కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. కుక్క యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రమాదకరమైన కుక్కల పెంపకంపై స్థానికంగా ఆంక్షలు కూడా విధించారు.
Loading Tweet...




















