ప్రయాగ్‌రాజ్, ఆగస్టు 25 (జనవాణి): పాఠశాలలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఠాగోర్ పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరఫున ఆమె తల్లి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలో పాఠశాలలో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఉండేదని, ఇప్పుడు అడ్డుకోవడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని విద్యార్థిని తరఫు వాదించింది. ఈ కేసును జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి మతాచారం అని నిరూపించేందుకు పిటిషనర్ తగిన ఆధారాలు సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది.
2022లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన హిజాబ్ తీర్పును కూడా ధర్మాసనం ప్రస్తావించింది. హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదన్న ఆ అభిప్రాయం నుంచి వైదొలగడానికి బలమైన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పాఠశాలలోని వివిధ తరగతి గదుల ఫొటోలను కోర్టు పరిశీలించింది. పిటిషన్ వేసిన విద్యార్థిని మినహా అదే మతానికి చెందిన ఇతర విద్యార్థినులు కూడా హిజాబ్ ధరించలేదని గుర్తించింది. దీంతో ముస్లిం విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి మతాచారం అన్న వాదన బలహీనపడుతుందని వ్యాఖ్యానించింది.
విద్యాసంస్థల్లో సమానత్వం, క్రమశిక్షణ, సంస్థాగత గుర్తింపును కాపాడేందుకు పాఠశాలలు వివక్ష లేకుండా యూనిఫాం నిబంధనలను అమలు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలతో యూనిఫాం నిబంధనలకు మినహాయింపులు ఇస్తే ‘యూనిఫాం’ అనే భావనకే విరుద్ధంగా మారుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థిని తరఫున దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.




















