న్యూఢిల్లీ, జులై 28: నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనల్లో పాల్గొని అరెస్టయిన విద్యార్థులు, కార్యకర్తలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే గతంలో క్రిమినల్ కేసులు ఉన్నవారికి ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.
అంతేకాదు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కూడా రాష్ట్రాలకు సూచించింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చని, కానీ తదుపరి చర్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంది.
విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వంటి చర్యలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో పారదర్శక దర్యాప్తు కోసం దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరా రికార్డులు, పోలీసు కమ్యూనికేషన్ రికార్డులను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే నిరసనకారుల వ్యక్తిగత సమాచారం, డిజిటల్ డేటాను బహిర్గతం చేయవద్దని కూడా స్పష్టం చేసింది. ఆగస్టు 3న జరగనున్న తదుపరి విచారణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సీజేపీ తమ ఆందోళనలను తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటించింది. నీట్ లీక్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారంలోగా నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చింది. అలా కానీ పక్షంలో మళ్లీ ఆందోళనలకు దిగుతామని హెచ్చరించింది.




















