ఢిల్లీలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్.. గూండాల మనసుల్లో భయం పుట్టించాలి

ఢిల్లీ లో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే నేరస్థుల మనసుల్లో పోలీసులంటే భయం కలిగేలా పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. అసలు నేరమే జరగకుండా నిరోధించడమే ముఖ్యమని స్పష్టం చేసింది.

5 అక్టోబర్, 2026 4:50 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఢిల్లీలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్.. గూండాల మనసుల్లో భయం పుట్టించాలి

న్యూఢిల్లీ,అక్టోబర్ 5 (జనవాణి): ఢిల్లీలో మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక నేరాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం దేశ రాజధానిలో మహిళలు భద్రంగా ఉన్నామనే నమ్మకంతో జీవించే పరిస్థితులు కల్పించాలని స్పష్టం చేసింది. మహిళలు రాత్రి 11 గంటల సమయంలో రోడ్లపై ప్రయాణిస్తున్నా, మెట్రోలో వెళ్తున్నా తమకు భద్రత ఉందనే భావన కలిగేలా పోలీసులు, అధికారులు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని సూచించింది.

నేరం జరిగిన తర్వాత చర్యల కంటే.. ముందే అడ్డుకోవాలి

అత్యాచారం వంటి నేరాలు జరిగిన తర్వాత పోలీసులు ఏం చేశారన్నదానికంటే నేరం జరగకుండా ముందే నిరోధించడమే అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలపై నేరాలకు పాల్పడే గూండాలు, అసాంఘిక శక్తుల మనసుల్లో పోలీసులంటే భయం ఉండాలని వ్యాఖ్యానించింది. నేరానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావన నేరస్థుల్లో కలిగేలా పోలీసింగ్ వ్యవస్థ ఉండాలని ఆదేశించింది. అవసరమైన సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకాడకూడదని స్పష్టం చేసింది.

ఢిల్లీలో మరింత పటిష్టమైన పోలీసింగ్ అవసరం

దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు మరింత కఠినమైన పోలీసింగ్ వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. ప్రత్యేకంగా మహిళలకు ప్రమాదం పొంచి ఉన్న సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా చర్యలను పెంచాలని పేర్కొంది.

బీట్ పెట్రోలింగ్‌పై ప్రత్యేక దృష్టి

ప్రజా భద్రతను కాపాడటంలో బీట్ పెట్రోలింగ్ కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు నిరంతరం చురుగ్గా గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసు వాహనాలను ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు నిలిపి ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించిన ధర్మాసనం సాధారణ గస్తీలో భాగంగా వాటిని నిరంతరం కదిలిస్తూ ఉండాలని సూచించింది. పోలీసులు స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదులను తెలుసుకోవాలని పేర్కొంది. వీధి దీపాల కొరత, అసాంఘిక వ్యక్తుల సంచారం వంటి సమస్యలను కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

పండగల వేళ మరింత అప్రమత్తత

పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో దుర్గా పూజ, దీపావళి వంటి సందర్భాల్లో నేర కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, గస్తీని పెంచాలని సూచించింది. చీకటిగా ఉండే, తగినంత వెలుతురు లేని ప్రాంతాల్లో లైటింగ్‌ను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యల వివరాలను కూడా పోలీసులను కోరింది.

ఇటీవల ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో వెలుగుచూసిన వరుస సామూహిక అత్యాచార ఘటనల నేపథ్యంలో మహిళలు, బాలికల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ కేసులను సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కీలక సూచనలు చేసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు