Tamil Nadu Budget 2026–27: విజయ్ సర్కారు తొలి బడ్జెట్.. విద్యారంగానికి భారీ కేటాయింపులు.. కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పాఠశాలలు, ఉన్నత విద్యకు వేల కోట్ల రూపాయలు కేటాయించింది.

5 ఆగస్టు, 2026 1:30 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Tamil Nadu Budget 2026–27: విజయ్ సర్కారు తొలి బడ్జెట్.. విద్యారంగానికి భారీ కేటాయింపులు.. కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు

Image By IANS

Tamil Nadu Budget 2026–27: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ బడ్జెట్‌ను సమర్పించారు. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా 2031 నాటికి తమిళనాడు స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP)ని 1.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.

విద్యారంగానికి భారీ కేటాయింపులు

ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ కోసం అమలు చేస్తున్న 'వెట్రి ల్యాప్‌టాప్' పథకానికి రూ.2,000 కోట్లు కేటాయించారు. అలాగే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు అందించేందుకు రూ.277 కోట్లు కేటాయించారు.

పాఠశాలల ఆధునికీకరణ

రాష్ట్రంలోని 3,734 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆధునికీకరణ కోసం రూ.2132 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఈ బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు. అదేవిధంగా 'సూపర్ క్లీన్ - సూపర్ క్యాంపస్' పథకం కోసం రూ.139 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పాఠశాలల్లో 24 గంటల సెక్యూరిటీతోపాటు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు.

ఉన్నత విద్య, ఉపాధిపై దృష్టి

ఇంటర్ మార్కుల ఆధారంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. మదురైలో ప్రత్యేక కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు రూ.90 కోట్లతో ఐదు కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ఇతర ముఖ్య కేటాయింపులు

ఆరోగ్య శాఖ: రూ.23,357 కోట్లు, వ్యవసాయ శాఖ: రూ.14,984 కోట్లు, రవాణా శాఖ: రూ.13,561 కోట్లు, హోం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్: రూ.17,290 కోట్లు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ: రూ.11,532 కోట్లు, వ్యవసాయ శాఖ: రూ.14,984 కోట్లు, జలనవరుల శాఖ: రూ.9264 కోట్లు, మున్సిపల్ శాఖ: రూ.29,863 కోట్లు, విద్యుత్ శాఖ: రూ.15,828 కోట్లు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి: రూ.8852 కోట్లు, పరిశ్రమల శాఖ: రూ.4414 కోట్లు. జౌళి, చేనేత: రూ.1678 కోట్లు, ఎంఎస్ఎంఈ: రూ.2142 కోట్లు, సహకార శాఖ: రూ.8028 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ: రూ.9818 కోట్లు, సింగప్పయాన్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్: రూ.354 కోట్లు, సోషల్ జస్టిస్ డిపార్ట్‌మెంట్: రూ.3937 కోట్లు. అదనంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించేందుకు రూ.560 కోట్లు, నవ వధువులకు 8 గ్రాముల బంగారం, పట్టు చీర అందించే పథకానికి రూ.812 కోట్లు కేటాయించడం విశేషం.

అప్పులపై ఆందోళన

గత ఐదేళ్లలో తమిళనాడు అప్పులు రెట్టింపు అయ్యాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. అప్పుల భారం తగ్గించేందుకు పారదర్శక టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే మద్యంపై ప్రత్యేక సుంకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు