వారణాసి,సెప్టెంబర్ 29 (జనవాణి): ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు.. విధులు పక్కనపెట్టి డ్యాన్స్ వీడియోలు తీస్తూ కెమెరాలకు చిక్కిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన కాశీలోని లాట్ భైరవ్ ఆలయ వార్షిక ఉత్సవంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
లాట్ భైరవ్ ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ ‘బాబా లాట్ భైరవ్ వివాహ ఉత్సవ్’, బారాత్ ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రివేళ భారీ సంఖ్యలో భక్తులు, స్థానికులు తరలివచ్చారు. కార్యక్రమంలో మహిళా కళాకారులు భోజ్‌పురి పాటలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
అదే సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న పలువురు పోలీసులు తమ బాధ్యతలను పక్కనపెట్టి మొబైల్ ఫోన్లలో డ్యాన్స్‌ను రికార్డ్ చేస్తూ కనిపించారు. మరికొందరు అక్కడే కూర్చొని ప్రదర్శనను వీక్షిస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
వీడియోలు వైరల్ కావడంతో పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించారు. విధుల్లో ఉన్న పోలీసులు మహిళా కళాకారుల డ్యాన్స్‌ను చిత్రీకరించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహిళల భద్రతను పర్యవేక్షించాల్సిన సిబ్బందే ఇలా వ్యవహరించడం ఆందోళన కలిగించే అంశమని కొందరు వ్యాఖ్యానించారు.
ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబేర్ కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని, ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పోలీసింగ్ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. నెటిజన్లు సైతం పోలీసుల తీరును విమర్శిస్తూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఇప్పటివరకు అధికారిక వివరణ లేదా సంబంధిత సిబ్బందిపై చర్యలకు సంబంధించిన సమాచారం వెలువడలేదు.
Loading Tweet...




















