ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..

ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

10 సెప్టెంబర్, 2026 6:59 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..

Social Media Image

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 10 (జనవాణి): చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వస్తున్నట్లు చైనా అధికారికంగా ప్రకటించింది.

జిన్‌పింగ్ పర్యటనపై చివరి వరకు చైనా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన బ్రిక్స్ సదస్సుకు వస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సదస్సుకు రెండు రోజుల ముందు చైనా అధికారిక ప్రకటన చేయడంతో దీనిపై స్పష్టత వచ్చింది.

గల్వాన్ తర్వాత ఇదే తొలిసారి

జిన్‌పింగ్ చివరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ ప్రాంతంలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో గల్వాన్ ఘర్షణ తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఆయన పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. చైనా-భారతదేశం సంబంధాలపై ఈ పర్యటన ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మోదీ-జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి

జిన్‌పింగ్ భారత్ పర్యటనను కేవలం బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే కార్యక్రమంగానే కాకుండా, భారత్-చైనా సంబంధాల్లో మారుతున్న సమీకరణాలకు సంకేతంగా కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందా? అనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 12న సదస్సు తొలి రోజునే మోదీ-జిన్‌పింగ్ భేటీ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఉన్నప్పటికీ, అధికారికంగా ద్వైపాక్షిక సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. జిన్‌పింగ్ పర్యటనతో భారత్-చైనా సంబంధాలు, సరిహద్దు అంశాలు, ద్వైపాక్షిక సహకారం వంటి కీలక అంశాలు మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు