ఆపరేషన్ చేస్తుండగా భారీ భూకంపం సంభవించడంతో రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. 7.1 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ప్రదర్శించిన సేవాభావం, ధైర్యసాహసాలు అందరినీ కదిలిస్తున్నాయి. భవనం బలంగా కంపిస్తున్నప్పటికీ, ప్రాణభయాన్ని పక్కనబెట్టి శస్త్రచికిత్సలో ఉన్న రోగిని కాపాడేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జపాన్‌లోని క్యూషూ ద్వీపంలో జులై 28న సంభవించిన ఈ భూకంపం తీవ్రత 7.1గా నమోదైంది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఓ రోగికి శస్త్రచికిత్స కొనసాగుతోంది. ఆపరేషన్ థియేటర్ లోపక భయానక వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆపరేషన్ థియేటర్‌లోని లైట్లు, వైద్య పరికరాలు, టేబుళ్లు బలంగా ఊగిపోయాయి. ప్రకంపనల తీవ్రతతో వైద్యులు నిలబడటమే కష్టంగా మారింది.
అయినప్పటికీ వైద్యులు ఆపరేషన్‌ను మధ్యలో వదిలేయకుండా రోగి ఉన్న బెడ్‌ను గట్టిగా పట్టుకుని కదలకుండా నిలిపారు. పేషెంట్‌పై ఎలాంటి వస్తువులు పడకుండా అడ్డుగా నిలబడి, ఆయన భద్రతను కాపాడేందుకు కృషి చేశారు. బయటకు పరుగులు తీయకుండా తమ బాధ్యతను ముందుగా భావించిన వైద్యులు ప్రదర్శించిన నిబద్ధతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న రోగి, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన అనంతరం శస్త్రచికిత్సను యథావిధిగా పూర్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆగస్టు 5 తరువాత ఆసుపత్రిలో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యాయి.
అధికారిక సమాచారం ప్రకారం ఈ భూకంపం ప్రభావంతో 38 మంది మృతి చెందగా, 120 మందికిపైగా గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడగా, వేలాది కుటుంబాలు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ భూకంపం తీవ్రత కారణంగా పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో కూడా పలు చోట్ల భూమి కంపించింది.
Loading Tweet...




















