సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు, జంతువులు, పక్షుల ఆకృతులు, కదలికలను అనుకరించే రోబోట్‌లను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు ఇప్పుడు జలచరాల తరహాలోనూ రోబోట్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ బైయోనిక్ ఫిష్ రోబోట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
చూడటానికి అచ్చం నిజమైన చేపలా కనిపించే ఈ రోబోట్‌ను తొలిచూపులో గుర్తించడం కూడా కష్టమే. నీటిలోకి వదిలిన వెంటనే నిజమైన చేప మాదిరిగా శరీరం, తోకను కదిలిస్తూ సహజంగా ఈదుతోంది. ప్రస్తుతం ఈ రోబోట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ వ్యక్తి నీటితో నిండిన తొట్టిలో రోబోటిక్ చేపను వేయగా.. అది ఎలాంటి అసహజత లేకుండా నీటిలో ఈదుతూ కనిపించింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చేపల కదలికలను అధ్యయనం చేసి..
ఈ బైయోనిక్ ఫిష్ రోబోట్‌ను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు నిజమైన చేపల సహజ కదలికలను నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. చేపలు ఈదేటప్పుడు శరీరం, తోకను ఏ విధంగా కదిలిస్తాయి? వేగాన్ని ఎలా నియంత్రిస్తాయి? దిశను ఎలా మార్చుకుంటాయి? వంటి అంశాలను అధ్యయనం చేసి, వాటి ఆధారంగా రోబోట్ కదలికలను రూపొందించారు. కేవలం చేప ఆకారాన్ని అనుకరించడమే కాకుండా.. నీటి అడుగున సమర్థంగా పనిచేసేలా ఈ రోబోట్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. సహజమైన ఈత కదలికలతో పాటు నీటిలో స్థిరంగా ప్రయాణించేలా దీని రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
భవిష్యత్ పరిశోధనల్లో కీలకంగా..
ఇలాంటి బైయోనిక్ జలచర రోబోట్‌లకు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. సముద్ర జీవుల పరిశీలన, నీటి అడుగున పరిశోధనలు, పర్యావరణ పరిస్థితుల అధ్యయనం, జలవనరుల పర్యవేక్షణ వంటి రంగాల్లో వీటిని ఉపయోగించే అవకాశం ఉంది. జీవుల సహజ కదలికలను సాంకేతికతతో అనుసంధానిస్తూ రూపొందిస్తున్న ఈ తరహా రోబోట్‌లు భవిష్యత్‌లో నీటి అడుగు ప్రపంచాన్ని అధ్యయనం చేసే విధానాన్ని మార్చే అవకాశం ఉంది.




















