174 మందిని కాపాడిన ‘రియల్ హీరో’..భారత పైలట్ సాహసానికి మోదీ ప్రశంసలు

దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్‌ కత్తితో దాడి చేయడంతో విమానం ప్రమాదకరంగా కిందికి పడిపోయింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యంగా ప్రతిఘటించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన అసాధారణ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు.

1 అక్టోబర్, 2026 12:11 PM•ByNarender Kumar Nangunoori

Share this article

174 మందిని కాపాడిన ‘రియల్ హీరో’..భారత పైలట్ సాహసానికి మోదీ ప్రశంసలు

ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కాక్‌పిట్‌లో కో-పైలట్‌తో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో కో-పైలట్‌ కత్తితో కెప్టెన్‌ మచ్చర్‌పై దాడి చేసినట్లు సమాచారం.

కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా..

కో-పైలట్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ మచ్చర్‌ వెనక్కి తగ్గలేదు. రక్తమోడుతున్నప్పటికీ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణ కారణంగా విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలోనే విమానం దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.

పరిస్థితి విషమించడంతో కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయి. ఈ సమయంలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆన్‌-డ్యూటీ సిబ్బంది విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయానికి సురక్షితంగా మళ్లించారు.

captaian

‘రియల్ హీరో’ అంటూ మోదీ ప్రశంసలు

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆయనను ‘రియల్‌ హీరో’గా అభివర్ణించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించాలనే పట్టుదలతో మచ్చర్‌ చూపిన ధైర్యం, అచంచల సంకల్పం అసాధారణమని పేర్కొన్నారు. వందలాది మంది ప్రాణాలను కాపాడటంతో పాటు పెను ప్రమాదాన్ని తప్పించారని ప్రశంసించారు. కెప్టెన్‌ మచ్చర్‌ను చూసి భారత్‌ గర్విస్తోందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

‘సెల్యూట్‌’ చేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

భారత పైలట్‌ అసాధారణ ధైర్యానికి సెల్యూట్‌ చేస్తున్నానంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పందించారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్‌ ప్రతిఘటించి కాక్‌పిట్‌ తలుపు తెరిచారని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని పేర్కొన్నారు. ఆయన సాహసం భారీ విమాన ప్రమాదాన్ని నివారించిందని తెలిపారు.

ట్రంప్‌ కూడా ‘హీరో’గా అభివర్ణన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా కెప్టెన్‌ మచ్చర్‌ చర్యను ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చేసిన సాహసం అద్భుతమని పేర్కొంటూ ‘హీరో’గా అభివర్ణించారు.

ఎవరీ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌?

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ భారత పౌరుడు. బోయింగ్‌ 737 విమానాలపై ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉన్నట్లు సమాచారం. ఆయనకు సుమారు 9,750 గంటల ఫ్లయింగ్‌ అనుభవం ఉన్నట్లు లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి.

2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్‌ అక్కడ లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌, సీనియర్‌ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లైదుబాయ్‌లో చేరినట్లు సమాచారం.

తబుక్‌లో చికిత్స

కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ మచ్చర్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు