మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ (Jackie Chan) మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ న్యూస్‌గా తేలింది. ‘1954–2026’ అని పేర్కొంటూ జాకీ చాన్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టడంతో ఈ వార్త క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ పోస్టులు విస్తృతంగా షేర్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘జాకీ చాన్‌కు ఏమైంది?’ అంటూ నెటిజన్లు ఆరా తీశారు. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు స్పష్టం చేశాయి.
జాకీ చాన్ క్షేమంగా ఉన్నారని, ఆయన మరణించారన్న వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని సంబంధిత ధృవీకరణలు వెల్లడించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, పోస్టుల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం మొదలైనట్లు తెలుస్తోంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లలోని కమ్యూనిటీ నోట్స్ కూడా ఈ పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవి తప్పుదోవ పట్టించే సమాచారమని పేర్కొన్నాయి.
ఇదే తొలిసారి కాదు. గతంలోనూ జాకీ చాన్ మరణించారంటూ డెత్ హోక్స్ సోషల్ మీడియాలో పలుమార్లు వైరల్ అయ్యాయి. ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించిన ఇలాంటి తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫొటోలు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
జాకీ చాన్ మరణించారన్న వార్తలు అవాస్తవమని తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారిక ప్రకటన లేదా విశ్వసనీయ మీడియా సంస్థల ధృవీకరణ లేకుండా సోషల్ మీడియాలో కనిపించే వార్తలను నమ్మకపోవడం, షేర్ చేయకపోవడం ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.




















