విమానంలో పైలట్ల ఫైటింగ్‌.. 33 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 17 వేల అడుగులకు!

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ విమానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. దీంతో హైజాక్‌ అనుమానాలు తలెత్తగా చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

30 సెప్టెంబర్, 2026 4:22 PM•ByNarender Kumar Nangunoori

Share this article

విమానంలో పైలట్ల ఫైటింగ్‌.. 33 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 17 వేల అడుగులకు!

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో బుధవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య శారీరక ఘర్షణ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడటంతో హైజాక్‌ అనుమానాలు వ్యక్తమయ్యాయి.

విమాన ట్రాకింగ్‌ సమాచారం ప్రకారం మొదట అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం వెలువడింది. ఆ తర్వాత అక్రమ జోక్యం లేదా హైజాకింగ్‌ను సూచించే మరో సంకేతం రావడంతో ఇజ్రాయెల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే సమయంలో విమానం సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా కేవలం రెండు నిమిషాల్లో దాదాపు 17 వేల అడుగుల మేర కిందకు దిగినట్లు ట్రాకింగ్‌ డేటా వెల్లడించింది. విమానం ప్రయాణ మార్గంలోనూ మార్పులు చోటుచేసుకోవడంతో పరిస్థితి తీవ్రతపై ఆందోళన నెలకొంది. దీంతో విమానాన్ని వాయువ్య సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయానికి మళ్లించారు. తొలుత విమానం హైజాక్‌కు గురైందనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి హైజాకింగ్‌ జరగలేదని ఇజ్రాయెల్‌ అధికారులు తర్వాత స్పష్టం చేశారు.

కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయని కొందరు ప్రయాణికులు చెప్పినట్లు సమాచారం. పైలట్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నట్లు కూడా ప్రయాణికులు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. చివరకు విమానం తబూక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు ఫ్లై దుబాయ్‌ ప్రకటించింది. పైలట్ల మధ్య ఘర్షణకు దారితీసిన కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు