నేపాల్ వరదల్లో 734 మృతదేహాలు వెలికితీత..గుర్తుతెలియని మృతదేహాల ఖననం

నేపాల్‌ను కుదిపేసిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు సుమారు 734 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా.. గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

30 ఆగస్టు, 2026 5:52 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నేపాల్ వరదల్లో 734 మృతదేహాలు వెలికితీత..గుర్తుతెలియని మృతదేహాల ఖననం

Social Media Image

నేపాల్‌ను ఆకస్మిక వరదలు (Flash Floods) అతలాకుతలం చేశాయి. సునామీలా విరుచుకుపడిన వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందాలు ఇప్పటివరకు సుమారు 734 మృతదేహాలను వెలికితీశాయి. అయితే వీరిలో కొందరిని గుర్తించలేకపోవడంతో పాటు.. వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు బంధువులు కూడా ముందుకు రాలేదు. మృతదేహాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆసుపత్రుల్లో నిల్వ చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 233 మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్ బాడీస్ వేగంగా కుళ్లిపోతుండటం, దుర్వాసనతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

DNA శాంపిల్.. యూనిక్ ID

గుర్తుతెలియని మృతదేహాలను ఖననం చేసే ముందు అధికారులు వాటి నుంచి DNA శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రతి మృతదేహానికి ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తున్నారు. శనివారం నాటికి 100కు పైగా మృతదేహాలకు DNA ప్రొఫైలింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా ఖననం

భవిష్యత్తులో బంధువులు గుర్తించినప్పుడు మృతదేహాలను తిరిగి వెలికితీసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1.5 మీటర్ల లోతులో గుంటలు తవ్వి, ఒక్కో మృతదేహానికి మధ్య 40 సెంటీమీటర్ల దూరం పాటిస్తున్నారు. మృతదేహాలను ప్రత్యేక బ్యాగుల్లో ఉంచి వాటిపై యూనిక్ ID నంబర్‌ను నమోదు చేస్తున్నారు. ప్రతి ఖనన స్థలంలో కాంక్రీట్ ప్లాట్‌ఫారమ్ నిర్మించి, ID నంబర్‌తో సైన్‌బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

DNA మ్యాచ్‌తో బంధువులకు అప్పగింత

మృతదేహాల ఖనన ప్రక్రియను ఫొటోలు, వీడియోల ద్వారా పూర్తిగా డాక్యుమెంట్ చేయడంతో పాటు.. ఖనన ప్రాంతాలను జియో-ట్యాగ్ చేస్తున్నారు. తమ వారి కోసం వెతుకుతున్న బంధువులు దేశంలోని ఆసుపత్రుల్లో DNA శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శాంపిల్స్‌ను నేపాల్ ఆరోగ్య శాఖ వద్ద భద్రపరిచిన మృతదేహాల DNA ప్రొఫైల్స్‌తో సరిపోల్చుతారు. DNA మ్యాచ్ అయితే సంబంధిత యూనిక్ ID ఆధారంగా పోలీసులు మృతదేహం ఖననం చేసిన ప్రదేశాన్ని గుర్తిస్తారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి, DNA సరిపోలిన బంధువులకు అప్పగిస్తారు. ఇక గుర్తుతెలియని మృతదేహాల వివరాలను పోలీసులు ప్రత్యేక వెబ్‌సైట్‌లోనూ నమోదు చేస్తున్నారు. నేపాల్‌లో విదేశీయులతో సహా ఇంకా సుమారు 2,500 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు