నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం..కళ్లెదుటే కొట్టుకుపోయిన సస్పెన్షన్ బ్రిడ్జి

నేపాల్‌లో మరోసారి భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం త్రిశూలీ నది ఉగ్రరూపం దాల్చడంతో ధాదింగ్, గూర్ఖా జిల్లాలను కలిపే కీలక సస్పెన్షన్ బ్రిడ్జి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరోవైపు అప్పర్ త్రిశూలీ-3ఏ ప్రాజెక్టు వద్ద నీటిమట్టం భారీగా పెరగడంతో సహాయక, రికవరీ చర్యలకు అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

30 ఆగస్టు, 2026 4:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం..కళ్లెదుటే కొట్టుకుపోయిన సస్పెన్షన్ బ్రిడ్జి

X Image

Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం త్రిశూలీ నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో ధాదింగ్, గూర్ఖా జిల్లాలను కలిపే కీలక సస్పెన్షన్ బ్రిడ్జి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. వంతెన నీటిలో కలిసిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

నీటిలో కొట్టుకుపోయిన కీలక వంతెన

ధాదింగ్ జిల్లాలోని చరౌండి, గూర్ఖా జిల్లాలోని గ్యాల్‌చోక్ ప్రాంతాలను కలిపే ఈ సస్పెన్షన్ బ్రిడ్జి స్థానికులకు ఎంతో కీలకం. నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వంతెనను భారీ ప్రవాహం కొట్టుకుపోయింది. నది ఒడ్డున ఉన్న పలు నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతం రివర్ రాఫ్టింగ్, బీచ్ క్యాంపింగ్‌కు ప్రసిద్ధి చెందింది.

రంగంలోకి హెలికాప్టర్లు

అప్పర్ త్రిశూలీ-3ఏ ప్రాజెక్టు వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తెల్లవారుజామునే నది నీటిమట్టం సుమారు 5 నుంచి 10 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహానికి ప్రాజెక్టు పరిసరాలు కోతకు గురవుతుండగా, రహదారులు ధ్వంసమయ్యాయి. వరద, బురద కారణంగా 19 సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు బయటకు తీయడం కష్టంగా మారింది. దీంతో రికవరీ, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అధికారులు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.

నదీ పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు

ఆగస్టు 26న భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలతో నేపాల్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భోటేకోశీ నదిలో కూడా నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ డివిజన్ హెచ్చరించింది. నదుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వరద ప్రవాహాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు