సముద్ర తీరంలో సరదాగా ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా భారీ అలల్లో చిక్కుకుపోయాడు. క్షణాల్లోనే సముద్రం లోపలికి కొట్టుకుపోయి స్పృహ కోల్పోయాడు. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించేలా 16 ఏళ్ల టీనేజ్ లైఫ్‌గార్డ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలల్లోకి దూకి బాలుడిని కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగింది?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్రూజ్ సమీపంలోని సీబ్రైట్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. డల్లాస్‌కు చెందిన 10 ఏళ్ల నథానియెల్ సముద్ర తీరంలో నీటిలో నిలబడి ఉండగా, ఒక్కసారిగా వచ్చిన భారీ అలలు అతడిని లోపలికి లాక్కెళ్లాయి. దాదాపు 10 అడుగుల ఎత్తున్న అలల కారణంగా బాలుడు క్షణాల్లోనే సముద్రంలోకి కొట్టుకుపోయాడు.
క్షణం ఆలస్యం చేయని 16 ఏళ్ల లైఫ్‌గార్డ్
అక్కడే విధుల్లో ఉన్న 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకి బాలుడి వద్దకు చేరుకున్నాడు. మొదటి ప్రయత్నంలో అలల ఉధృతి కారణంగా బాలుడిని బయటకు తీసుకురాలేకపోయానని రైడర్ తెలిపాడు. బాలుడు అప్పటికే స్పృహ కోల్పోయి ఉండటంతో రక్షించడం మరింత కష్టంగా మారిందని వివరించాడు. అయితే మరో లైఫ్‌గార్డ్, కొంతమంది స్థానికుల సహకారంతో చివరకు బాలుడిని ఒడ్డుకు చేర్చగలిగారు.
వీడియో వైరల్
ఈ రక్షణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో రైడర్ భారీ అలల మధ్య బాలుడిని గట్టిగా పట్టుకుని ఈదుతూ ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Loading Tweet...
"ఆ రుణం జీవితంలో తీర్చలేను"
తన కుమారుడి ప్రాణాలను కాపాడిన లైఫ్‌గార్డ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తండ్రి సుమిత్ రాయ్ భావోద్వేగంగా చెప్పారు.
"అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సముద్రంలోకి దూకడం అంటే తన ప్రాణాలనే పణంగా పెట్టినట్టే. ఆయన చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ తీర్చలేను. జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను" అని అన్నారు.
మరోవైపు రైడర్ విలియమ్స్ మాత్రం, "బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం నా అదృష్టం. ఇదే నా బాధ్యత. ప్రతిరోజూ ఇలాంటి రక్షణ చర్యలు చేపడుతున్న నా సహచర లైఫ్‌గార్డ్స్‌కు కూడా కృతజ్ఞతలు" అని స్పందించాడు.




















