Adventure Tourism | ఒకప్పుడు భారత్ పర్యటన అంటే తాజ్‌మహల్, జైపూర్ కోటలు, వారణాసి ఘాట్‌లు, గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్ గుర్తుకు వచ్చేవి. భారతీయ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, దేవాలయాలు, చారిత్రక నిర్మాణాలకే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కాలానుగుణంగా పర్యాటకుల అభిరుచులు మారుతున్నాయి. కేవలం ఫొటోలు దిగడం, ప్రముఖ ప్రదేశాలను చూడడానికే కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి కోసం ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. పర్వతారోహణ, ట్రెక్కింగ్, రోడ్ ట్రిప్‌లు, జంగిల్ సఫారీ, ఎత్తైన ప్రాంతాల్లో డ్రైవింగ్, క్యాంపింగ్, స్థానిక సంస్కృతిని దగ్గరగా ఆస్వాదించడం వంటి అనుభవాల కోసం పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. హిమాలయ పర్వతాలు, ఎడారులు, బీచ్‌లు, దట్టమైన అడవులు, ప్రకృతి అందాలు అన్నీ భారత్‌లో ఉన్నప్పటికీ.. అడ్వెంచర్ టూరిజం గమ్యస్థానంగా దేశానికి రావాల్సిన స్థాయి గుర్తింపు ఇంకా పూర్తిగా లభించలేదనే చెప్పాలి. సాధారణ విహారయాత్ర కాకుండా జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చే పర్యటన చేయాలనుకునేవారికి భారత్‌లోని పలు ప్రాంతాలు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.
లడఖ్ : సాహసయాత్రికుల స్వర్గధామం
లడఖ్‌ను కేవలం హిల్ స్టేషన్‌గా చెప్పడం సరిపోదు. దేశంలోనే అతిపెద్ద అడ్వెంచర్‌కు గమ్యస్థానంగా ఇది నిలుస్తోంది. మంచుతో కప్పుకున్న ఎత్తైన కనుమలు, ప్రశాంతమైన బౌద్ధ మఠాలు, నీలిరంగు సరస్సులు, నక్షత్రాలతో మెరిసే రాత్రి ఆకాశం ప్రతి పర్యాటకుడికి ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో వాహనాలు ప్రయాణించే రహదారుల్లో ఒకటైన ‘ఉమ్లింగ్ లా’ మార్గం అడ్వెంచర్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది.

స్పీతి, అరుణాచల్: ప్రకృతి ఒడిలో ప్రశాంత యాత్ర
నగర జీవితంలోని రద్దీకి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిజమైన ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పీతి వ్యాలీ, అరుణాచల్‌ప్రదేశ్ బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాలు, పురాతన బౌద్ధ మఠాలు, సర్పాల్లా మెలికలు తిరిగే కొండ మార్గాలు, నిశ్శబ్దమైన లోయలు ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రకృతి ఒడిలో సమయం గడపాలనుకునే వారికి ఇవి మరపురాని అనుభవాన్ని అందిస్తాయి.

పర్యటన సరిపోదు.. సంస్కృతినీ గౌరవించాలి..
ప్రస్తుత ట్రావెల్ ట్రెండ్‌లో పర్యాటకుల ఆలోచనల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఒక ప్రదేశంలో ఫొటోలు దిగడం మాత్రమే కాకుండా, అక్కడి సంస్కృతి, స్థానిక వంటకాలు, గ్రామీణ జీవనం, ట్రెక్కింగ్, రోడ్ ట్రిప్‌లు, రాత్రి వేళ ఆకాశ వీక్షణ వంటి అనుభవాలను కూడా యాత్రలో భాగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్‌పీరియెన్షియల్ టూరిజం’కు ఆదరణ పెరుగుతోంది. హిమాలయ పర్వత శ్రేణులు, థార్ ఎడారి, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారత దట్టమైన అడవులు, విస్తారమైన సముద్ర తీరం, ఎత్తైన పర్వత మార్గాలు వంటి భౌగోళిక వైవిధ్యం భారత్‌కు ప్రత్యేక బలంగా నిలుస్తోంది. ఇలాంటి సహజ సంపద చాలా కొద్ది దేశాలకే ఉంది. రహదారుల అభివృద్ధి, స్పష్టమైన మార్గదర్శక సూచికలు, సురక్షిత ట్రెక్కింగ్ మార్గాలు, శిక్షణ పొందిన స్థానిక గైడ్‌లు, మెరుగైన పర్యాటక సదుపాయాలు అందుబాటులోకి వస్తే, ప్రపంచ అడ్వెంచర్ టూరిజంలో భారత్ కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అడ్వెంచర్ టూరిజం అంటే కేవలం సాహస యాత్రలు మాత్రమే కాదు.. ప్రకృతిని, స్థానిక సంస్కృతిని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణానికి హాని కలిగించకుండా వ్యవహరించడం, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం వంటి బాధ్యతాయుత చర్యలు పర్యటనను మరింత అర్థవంతంగా మారుస్తాయి. దీంతో పర్యాటక రంగంతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధికీ మేలు చేకూరుతుంది.




















