తల్లిదండ్రుల ప్రేమకు కొలమానం ఉండదు. పిల్లలు చిన్న మాట అన్నా.. వారి మనసులోని బాధను అర్థం చేసుకుని అండగా నిలబడతారు. తాజాగా ఓ తండ్రి తన కూతురిపై చూపించిన ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ కూతురు ముందు రోజు తన తండ్రికి మెసేజ్ పంపింది. మరుసటి ఉదయం తలుపు తెరిచిన ఆమెకు భుజాన బ్యాగుతో తండ్రి ఎదురుగా కనిపించారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.
కూతురిని చూసేందుకు ఆయన ఏకంగా 14 గంటలు ప్రయాణించి వచ్చారు. ఆమెతో సుమారు 8 గంటలు గడిపిన అనంతరం, మరో 14 గంటలు ప్రయాణించి తిరిగి వెళ్లారు. అంటే కూతురు పంపిన ఒక్క మెసేజ్‌కు స్పందించేందుకు ఆయన మొత్తం 28 గంటల ప్రయాణం చేశారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కూతురితో గడిపిన సమయంలోనూ తన పనులు, ఫోన్ కాల్స్‌ను కొనసాగిస్తూనే ఆమెకు ఇష్టమైన పనులు చేశారు. ఇంట్లో పాత్రలు శుభ్రం చేయడం, కూతురిని బయటకు తీసుకెళ్లడం, ఆమెకు ఇష్టమైన ఆహారం తినిపించడం వంటి చిన్న చిన్న పనులు చేశారు.తిరుగు ప్రయాణానికి ముందు కూతురికి ధైర్యం చెబుతూ.. ‘హ్యాపీగా ఉండు.. నేనెప్పుడూ నీతోనే ఉంటా’ అంటూ భరోసా ఇచ్చారు. ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను @apple.kaivalya అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నేను నాన్నను రమ్మని అడగలేదు. నేను ఎప్పుడూ ఒంటరిగా లేనని గుర్తుచేసేందుకే ఆయన ఇంత దూరం వచ్చారు’ అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తండ్రి ప్రేమను కొనియాడుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే భరోసా, ప్రేమ ఎంత విలువైనదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.




















