భారత్‌కు చెందిన మహిళ రేణు ధరియాల్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అధికారులు ఆమె జుట్టును అధికారికంగా కొలవగా.. 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు) ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ రికార్డును అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఇప్పటివరకు ఈ రికార్డు పేరిట ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన అలియా నసిరోవా రికార్డు బద్దలైంది. ఆమె జుట్టు పొడవు 257.33 సెంటీమీటర్లుగా నమోదైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా రికార్డులకెక్కిన రాబర్ట్ వాడ్లో ఎత్తు 272 సెంటీమీటర్లకు రేణు జుట్టు పొడవు దాదాపు సమానంగా ఉండటం మరో విశేషం.
2015 నుంచి జుట్టు కత్తిరించలేదు
రేణు ధరియాల్ వృత్తిరీత్యా కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్. మహిళలకు అందం, జుట్టు సంరక్షణకు సంబంధించిన చిట్కాలను ఆమె అందిస్తుంటారు. భారతీయ సంస్కృతిలో పొడవాటి జుట్టును అందం, సంప్రదాయానికి ప్రతీకగా భావించడం తనకు స్ఫూర్తినిచ్చిందని రేణు తెలిపారు. 2015 నుంచి జుట్టును పెంచుతున్నానని.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా కత్తిరించలేదని ఆమె వెల్లడించారు.
జుట్టు సంరక్షణకు గంటల సమయం
ఇంత పొడవాటి జుట్టును సంరక్షించడం అంత సులభం కాదని రేణు తెలిపారు. జుట్టును శుభ్రం చేయడం, చిక్కులు తొలగించడం వంటి వాటికి గంటల సమయం పడుతుందని చెప్పారు. తన ఒత్తైన, నిగనిగలాడే జుట్టు నేలపై పడకుండా ఉండేందుకు దాన్ని పెద్ద జడగా అల్లుకుంటానని ఆమె వివరించారు. ఎంతో ఓపికతో జుట్టును సంరక్షిస్తూ చివరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల రేణు ఆనందం వ్యక్తం చేశారు.
Loading Tweet...




















