Gen Z | ఉంగరం తిప్పితే టెన్షన్ తగ్గుతుందా.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ!

ఒకప్పుడు నగలు అంటే అందాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అవి ఫ్యాషన్‌తో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే సాధనాలుగా కూడా మారుతున్నాయి. ముఖ్యంగా యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ పేరిట జెన్‌జీని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

28 జులై, 2026 5:45 PM•ByRamchandram

Share this article

Gen Z | ఉంగరం తిప్పితే టెన్షన్ తగ్గుతుందా.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ!

Anti Anxiety Jewellery (Source: AI Generated Image)

ఒకప్పుడు నగలు అంటే అందాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అవి ఫ్యాషన్‌తో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే సాధనాలుగా కూడా మారుతున్నాయి. ఉంగరం తిప్పడం, గొలుసును చేతిలో పట్టుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వేళ్లతో చిన్న బిడ్స్‌ను కదలించడం.. ఇవన్నీ ఇప్పుడు యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా జెన్‌జీలో ఈ నగలకు ఆదరణ పెరుగుతోంది. ఒత్తిడి, ఆందోళన పెరిగినప్పుడు అందరికీ కనిపించేలా ఫిడ్జెట్ టాయ్స్‌ను వాడటం కంటే కూడా చేతికి ఉన్న ఉంగరాన్ని తిప్పడం లేదా.. చైన్‌లోపి ప్రత్యేక పెండెంట్‌ను ఉపయోగించడం మరింత సహజంగా అనిపిస్తోందని యువత చెబుతోంది. దీంతో వెల్‌నెస్, ఫ్యాషన్ కలగలసిన ఈ కొత్త యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.

యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ అంటే ఏంటి?

ఇవి చూడటానికి సాధారణ నగల్లానే కనిపిస్తాయి. కానీ వీటిలో చిన్న మెకానికల్ లేదా కదలే భాగాలు ఉంటాయి. స్పిన్నర్ రింగ్స్, వేళ్లతో తిప్పుకునే రోలింగ్ బీడ్స్ ఉన్న ఉంటరాలు, నెమ్మదిగా శ్వాస తీసుకునేందుకు ఉపయోగించే బ్రీతింగ్ పెండెంట్లు, అరోమాథెరపీ ఆయిల్స్ వేసుకునే ప్రత్యేక బ్రేస్‌లేట్లు, నెక్లెస్‌లు వంటివి చూడటానికి సాధారణ నగల్లాగే కనిపిస్తాయి. కానీ వీటిని ధరించిన వ్యక్తి ఒత్తిడిగా అనిపించినప్పుడు వాటిని తిప్పడం ద్వారా తన దృష్టిని ఆందోళన నుంచి మళ్లించుకునే అవకాశం ఉంది.

కొత్త ట్రెండ్ ఏమీ కాదు!

చేతితో కదలించే లేదా తిప్పుకునే నగలు కొత్తవి కాదు. 1950లో జర్మనీకి చెందిన ప్రసిద్ధ స్వర్ణకారుడు ఫ్రెడ్రిక్ బెకర్.. కైనెటిక్ జ్యువెల్లరీ పేరిట వీటిని రూపొందించారు. అప్పట్లో ఇవి కళాత్మకతకు ప్రతిబింబించే నగలుగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు అదే ఆలోచనను మానసిక ఆరోగ్యంతో అనుసంధానిస్తూ యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీని తీసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్‌మీడియా, మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ పెరగడంతో వీటి ఆదరణ మరింత పెరిగింది.

ఇవి ఎలా పనిచేస్తాయి?

స్పిన్నర్ రింగ్‌ను పదేపదే తిప్పడం, బీడ్స్‌ను చేతివేళ్లతో కదిలించడం వంటి చర్యలు మెదడును ఒకే పనిపై కేంద్రీకరించేందుకు సహాయపడతాయి. దీంతో ఆందోళన కలగించే ఆలోచనల నుంచి కొంతసేపు దృష్టి మళ్లుతుంది. అలాగే బ్రీతింగ్ పెండెంట్లు నెమ్మెదిగా శ్వాస తీసుకునే అలవాటును పెంచుతాయి. దీనివల్ల శరీరం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మనస్తత్వ శాస్త్రంలో దీన్ని గ్రౌండింగ్ టెక్నిక్ అని పిలుస్తారు. అంటే భయం, ఆందోళన, ఒత్తిడి వంటి భావాల నుంచి దృష్టిని మరల్చి, పనిపై దృష్టి పెట్టేలా చేయడం.

నిజంగానే ఒత్తిడి/ఆందోళన తగ్గుతుందా?

మానసిక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ ఆందోళనకు చికిత్స కాదు. అయితే రోజువారీ జీవితంలో ఎదురయ్యే తాత్కాలిక ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడే సెల్ఫ్ సూథింగ్ టూల్‌గా ఇది పనిచేసే అవకాశం ఉంది. ఒకే పనిని పదేపదే చేయడం వల్ల మెదడుకు కొంత ప్రశాంతంగా మారుతుంది. అలాగే నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో రిలాక్సేషన్ ప్రతిస్పందన ప్రారంభమవుతుంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాకపోతే ఈ ఆభరణాలపై జరిగిన పలు పరిశోధనల ప్రకారం.. పదే పదే చేసే కదలికలు కొంతమందిలో ఒత్తిడిని తగ్గించవచ్చని వెల్లడైంది. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, గుండె స్పందనను నియంత్రించడంలో సహాయపడవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న పనిపై దృష్టి పెట్టడం వల్ ఆందోళన తాత్కాలికంగా తగ్గవచ్చు. అయితే ఇవి వ్యక్తిగత అనుభవాల మీదనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు

ఈ యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ తాత్కాలిక ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే పనిచేస్తుంది. కానీ తరచూ ఆందోళన వస్తుంటే, నిద్రలేమి, పనిపై ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ మీదనే ఆధారపడకుండా సైకాలజిస్టులను కలవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జెన్‌జీకి ఎందుకు నచ్చుతోంది?

ఈ యాంటీ యాంగ్జైటీ జ్యువెల్లరీ సాధారణ నగల్లా కనిపించడం వీటి ప్రత్యేకత. వీటిని ఆఫీసు, కాలేజీ, జర్నీలు.. ఇలా ఎక్కడైనా ధరించవచ్చు. దీంతో ఒత్తిడి కలిగినప్పుడల్లా ఇతరులకు తెలియకుండా ఉంగరం తిప్పడం, బీడ్స్‌ను కదిలించడం ద్వారా కొంత ఉపశమన పొందుతున్నామని జెన్‌జీ యువత చెబుతోంది. అందుకే వీటికి ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ ఆభరణాలు కొంతమందికి తాత్కాలిక మానసిక ప్రశాంతతను అందించవచ్చు. కానీ వైద్య చికిత్సకు మాత్రం ప్రత్యామ్నాయం కాదని.. ఆందోళన లక్షణాలు తరచూ కనిపిస్తే వెంటనే సైకాలజిస్టులను కలవాలని నిపుణులు సూచిస్తున్నారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు