హైదరాబాద్ : దేశ అత్యున్నత చట్టసభల్లో జెన్ జీ (Gen Z) యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించేలా ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ, లోక్‌సభకు 21 ఏళ్లకే, శాసనమండలి, రాజ్యసభకు 25 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
శనివారం హైదరాబాద్‌లో నీట్ ప్రశ్నాపత్రాల లీక్, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న అనంతరం యువతను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో 21 ఏళ్లకే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే, భారత యువతకు అదే అవకాశం ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. దేశ జనాభాలో గణనీయమైన శాతం జెన్ జీ యువత ఉన్నప్పటికీ, లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం ఒక శాతం కూడా లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.
ఈ అంశంపై ఆగస్టు తొలి వారంలో శాసనసభ, శాసనమండలిని ప్రత్యేకంగా సమావేశపరచి తీర్మానం ఆమోదించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. యువత సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే చట్టసభల్లోనే వారి గొంతు వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యువతకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలను సీఎం గుర్తు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన 61వ రాజ్యాంగ సవరణతో ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గిందని, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించారని వివరించారు.
సివిల్ సర్వీసుల్లో 21 ఏళ్లకే అవకాశం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశాన్ని కూడా అదే వయసులో కల్పించాలని అభిప్రాయపడ్డారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎంపికైన యువత ఉదాహరణలను ప్రస్తావిస్తూ, సామర్థ్యానికి వయసు అడ్డంకి కాదని చెప్పారు.
యువత రోడ్లపై నిరసనలు చేయాల్సిన పరిస్థితి కాకుండా, నేరుగా పార్లమెంట్‌లో తమ అభిప్రాయాలు వినిపించే స్థాయికి రావాలని సీఎం పిలుపునిచ్చారు. జెన్ జీ యువతకు రాజకీయాల్లో తగిన స్థానం కల్పించడం ద్వారా దేశ పాలనలో వారి భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రస్తావిస్తూ, అది విద్యార్థుల ఉద్యమ విజయంగా అభివర్ణించారు. అయితే ఉద్యమం అక్కడితో ముగియలేదని, ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలపై కూడా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
అలాగే కేంద్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే విద్యాశాఖను జెన్ జీ ప్రతినిధికి అప్పగించేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




















