పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే చివరి ఛాన్స్‌.. ఆ తర్వాత నవంబర్‌ వరకూ ఆగాల్సిందే!

శ్రావణమాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి మొదలైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత అక్టోబర్‌ 29 వరకు ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.

14 ఆగస్టు, 2026 9:03 AM•ByRalin

Share this article

పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే చివరి ఛాన్స్‌.. ఆ తర్వాత నవంబర్‌ వరకూ ఆగాల్సిందే!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనవాణి): శ్రావణమాసం ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి మొదలైంది. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, నూతన గృహ నిర్మాణ పూజలు, వ్రతాలు, వ్యాపార ప్రారంభాలకు అనుకూలమైన కాలంగా భావించే శ్రావణమాసంలో ఈసారి భారీగా శుభకార్యాలు జరగనున్నాయి. అయితే శ్రావణం ముగిసిన తర్వాత మాత్రం శుభ ముహూర్తాలకు సుదీర్ఘ విరామం ఉండనుంది. మళ్లీ నవంబర్‌లోనే పెళ్లిళ్లకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు.

నెల రోజులే.. పెళ్లిళ్లకు ఫుల్‌ డిమాండ్‌

ఆగస్టు 13న ప్రారంభమైన శ్రావణమాసం సెప్టెంబర్‌ 11తో ముగియనుంది. ఈ సమయంలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, నాగపంచమి, అమ్మవారి విశేష పూజలు వంటి పర్వదినాలు ఉండటంతో ఆలయాలు, ఇళ్లు పండుగ వాతావరణాన్ని సంతరించుకోనున్నాయి. ఇదే సమయంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సీజన్‌లోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న వారు ఇప్పటికే కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. పురోహితులు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, డెకరేషన్‌ సిబ్బంది, మేకప్‌ ఆర్టిస్టులు తదితరులకు వరుస ఆర్డర్లు వస్తున్నాయి.

ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు

పండితుల వివరాల ప్రకారం ఆగస్టులో 15, 16, 21, 22, 23, 26, 27, 28, 30 తేదీల్లో వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 3, 4, 5, 8, 10, 11 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంటే శ్రావణమాసం ముగిసే సెప్టెంబర్‌ 11 తర్వాత పెళ్లిళ్లకు ముహూర్తాల విషయంలో విరామం రానుంది.

అక్టోబర్‌ 29 వరకు ఎందుకు లేవంటే..

శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదాన్ని శూన్యమాసంగా పరిగణించడంతో వివాహాది శుభకార్యాలు నిర్వహించరని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆశ్వయుజ మాసంలో శుక్రమౌఢ్యం కారణంగా కూడా వివాహ ముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు. చాతుర్మాస్య దీక్షలు, పితృపక్షాలు వంటి కారణాలు కూడా శుభకార్యాలకు విరామానికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.

దీంతో అక్టోబర్‌ 29 వరకు పెళ్లి ముహూర్తాలు లేకుండా.. నవంబర్‌లో మళ్లీ శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌లోనూ వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన రోజులు ఉండనున్నాయి.

పది వేల వరకు పెళ్లిళ్లు?

శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10 వేల వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఒక్క నెలలోనే వివాహ సంబంధిత వ్యాపారాలకు భారీగా గిరాకీ ఏర్పడనుంది. మొత్తంగా చూస్తే.. శ్రావణం పెళ్లిళ్ల సీజన్‌కు తెరతీస్తే, ఆ తర్వాత వచ్చే విరామం కారణంగా ఈ నెలలోనే పెళ్లి చేసుకోవాలనుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు