కొత్తగూడెం, ఆగస్టు 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్‌కుమార్‌ను కేరళలో అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. భార్పాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు తాను భద్రాచలంలోని ఐటీసీ పేపర్‌బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పి, తనతో భాగస్వాములైతే కాంట్రాక్ట్ పనుల్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి పలువురి నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
బాధితుల విశ్వాసం పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో నాలుగు శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలు నిర్వహిస్తూ ఈ మోసాన్ని కొనసాగించినట్లు విచారణలో తేలిందన్నారు.
కేరళలో అరెస్టు.. 35 వాహనాల స్వాధీనం
సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసిన పోలీసులు, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకొచ్చి విచారించారు. దర్యాప్తులో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లతో కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలం రాజీవ్‌నగర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం, ఒక స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మనీ ట్రయల్‌పై దర్యాప్తు
ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీయడం లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
అధిక లాభాలు, తక్కువ సమయంలో రెట్టింపు రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు, సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు అభినందించారు.





















