బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

11 సెప్టెంబర్, 2026 4:02 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనవాణి): సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం చోరీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్మీ ఆయుధాగారం నుంచి తుపాకులు, పిస్టళ్లు, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిలో మాజీ ఆర్మీ అధికారి కూడా ఉన్నారని ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలపై తెలంగాణ పోలీసులు కీలక స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఆయుధాల చోరీ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

కేసు దర్యాప్తుపై సరైన సమాచారం లేకుండా మెయిన్‌స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో పలు ఊహాజనిత వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని డీసీపీ పేర్కొన్నారు. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తే మల్కాజిగిరి పోలీసులు అధికారికంగా వెల్లడిస్తారని స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగింది?

ఆగస్టు 31న మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని సైనిక సిబ్బంది గుర్తించారు. అనంతరం ఆయుధాలు, మందుగుండు సామగ్రి గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. గల్లంతైన వాటిలో ఐదు అసాల్ట్ రైఫిళ్లు, ఏడు పిస్టళ్లు, 21 మ్యాగజైన్లు, సుమారు రూ.15 లక్షల విలువైన మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. ఆర్మీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయుధాగారం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాగారం భద్రతా ఏర్పాట్లపైనా సమగ్రంగా ఆరా తీస్తున్నారు.

రంగంలోకి పలు దర్యాప్తు సంస్థలు

ఈ కేసు అత్యంత సున్నితమైనది కావడంతో తెలంగాణ కౌంటర్-ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్, మల్కాజిగిరి పోలీసులు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఐఏతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

రెజిమెంట్ సమీపంలో 160 డిటోనేటర్లు

ఇదిలా ఉండగా, ఆయుధాల చోరీపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మద్రాస్ రెజిమెంట్ ప్రహరీ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది. రెజిమెంట్ సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్‌కు ఆనుకుని ఉన్న ఫైరింగ్ రేంజ్ గోడ వద్ద వీటిని గుర్తించారు. అధికారులు డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని, అవి అక్కడికి ఎలా వచ్చాయి? వాటికి ఆయుధాల చోరీ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయుధాల చోరీ కేసులో అరెస్టులు జరిగినట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలను నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు