విజయనగరం జిల్లా,సెప్టెంబర్ 10 (జనవాణి): మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరడం విజయనగరం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. బొత్స రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయ, పార్టీ, కుటుంబ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన చిన్న శ్రీను పార్టీ మారడం చర్చకు దారితీసింది.
చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు, కార్యకర్తలకు మధ్య వారధిగా చిన్న శ్రీను వ్యవహరించేవారని ఆయన అనుచరులు చెబుతుంటారు. నియోజకవర్గంలోని కార్యకర్తల సమస్యలను బొత్స దృష్టికి తీసుకెళ్లడం నుంచి పార్టీ కార్యక్రమాల నిర్వహణ వరకు ఆయన కీలక పాత్ర పోషించేవారని పేర్కొంటారు.
ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి
విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో చిన్న శ్రీనుతో తనకున్న అనుబంధాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఒక దశలో ఆయన బోరున ఏడవడంతో సభలో ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.
బొత్స కుమార్తె అనూష ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. పార్టీ నేతలు, అనుచరులు సైతం బొత్సకు ధైర్యం చెప్పారు. చిన్న శ్రీను పార్టీని వీడినా తామంతా ఆయన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘జై బొత్స’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బొత్సకు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.
బొత్సకు వెన్నంటే చిన్న శ్రీను
బొత్స సత్యనారాయణ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో చీపురుపల్లి నియోజకవర్గ వ్యవహారాలను చిన్న శ్రీను పర్యవేక్షించేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బొత్స నియోజకవర్గానికి వచ్చినప్పుడు కార్యక్రమాల సమన్వయం, కార్యకర్తలతో సమావేశాలు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో చిన్న శ్రీను కీలకంగా ఉండేవారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బొత్సకు, చీపురుపల్లి కార్యకర్తలకు మధ్య చిన్న శ్రీను ఒక వారధిగా మారారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే కాలక్రమంలో చిన్న శ్రీను కూడా జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకున్నారు.
జిల్లాలో కీలక పదవులు.. సొంత రాజకీయ గుర్తింపు
వైసీపీలో చిన్న శ్రీనుకు కీలక బాధ్యతలు దక్కాయి. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు పలు నియోజకవర్గాలకు పరిశీలకుడిగా వ్యవహరించారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. మామ బొత్స సత్యనారాయణ వెనుక రాజకీయాలు నేర్చుకున్న చిన్న శ్రీను క్రమంగా సొంత రాజకీయ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
2024 తర్వాత విభేదాలపై ప్రచారం
2024 ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనుల మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చిన్న శ్రీనుకు దక్కకపోవడంపై ఆయన వర్గంలో అసంతృప్తి ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. బొత్స కుటుంబానికి ఇప్పటికే రాజకీయంగా ప్రాధాన్యం ఉండటంతో మరిన్ని అవకాశాలు అదే కుటుంబానికి పరిమితం అవుతున్నాయనే భావన చిన్న శ్రీనులో ఏర్పడిందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారికంగా స్పష్టమైన ధృవీకరణ లేదు.
రాజకీయ వారసత్వం విషయంలోనే దూరం పెరిగిందా?
చిన్న శ్రీను రాజకీయ భవిష్యత్‌తో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర రాజకీయంగా చురుగ్గా ఉండటం కూడా చర్చకు వచ్చింది. ‘చిన్న శ్రీను సోల్జర్స్’ పేరుతో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆమె ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ తన కుమార్తె బొత్స అనూషను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం ఉంది. అనూషను భవిష్యత్‌లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా చూడాలనేది తన ఆకాంక్ష అని బొత్స గతంలో చెప్పినట్లు పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజకీయ వారసత్వం, భవిష్యత్ పదవుల విషయంలో బొత్స కుటుంబం–చిన్న శ్రీను మధ్య దూరం పెరిగిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణం ఇదేనా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
చీపురుపల్లి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో చీపురుపల్లి రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచినట్టైంది. ఇన్నాళ్లు బొత్స కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేత ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో కీలకంగా వ్యవహరించబోతుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిన్న శ్రీను పార్టీ మారినప్పటికీ తనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉన్నారనే సంకేతాన్ని బొత్స వర్గం ఆత్మీయ సమావేశం ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసింది. దీంతో రాబోయే రోజుల్లో చీపురుపల్లి రాజకీయాల్లో బొత్స, చిన్న శ్రీనుల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం మేనల్లుడు పార్టీ మారిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురైన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




















