1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ భగ్గుమంది.. తొర్రూరులో యువత, విద్యార్థుల బైక్ ర్యాలీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా విమర్శించారు.

5 సెప్టెంబర్, 2026 5:24 PM•ByNarender Kumar Nangunoori

Share this article

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ భగ్గుమంది.. తొర్రూరులో యువత, విద్యార్థుల బైక్ ర్యాలీ

తొర్రూరు,సెప్టెంబర్ 5 (జనవాణి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, రాయపర్తి, పెద్దవంగర, తొర్రూరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. విద్యార్థులు, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు రూ.5 లక్షల గ్యారంటీ కార్డు, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను కూడా పూర్తిచేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందడం లేదని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విషయంలోనూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. మహిళలకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు అందిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలిచామని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, యువత భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని పేర్కొన్న ఆయన.. మరో రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

errabelli byke ryali

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు