హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనవాణి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆందోళనకారులకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న ఎస్‌ఐ నిఖిత్ కుమార్‌పై బీఆర్ఎస్ నేతలు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. హాకా భవనం వద్ద నిలిపి ఉంచిన ప్రభుత్వ వాహనం అద్దాన్ని కూడా ధ్వంసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ఆందోళనకారులపై (PDPP) యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న తాతా మధును, కోకాపేటలోని తన నివాసంలో ఉన్న నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై U/s 352 r/w 3(5) BNS, Sec. 3(1)(r), 3(2)(va) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ రైతు దీక్షకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ వద్ద నిర్వహించనున్న రైతు దీక్షకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు నేతలను గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో అక్కడ కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి కూడా పోలీసులు వెళ్లారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనలు, స్పీకర్‌పై ఎమ్మెల్సీల వ్యాఖ్యలు, వరుస అరెస్టులతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




















