చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 31 వరకు అవకాశం

చేయూత సామాజిక భద్రత పింఛన్‌ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

11 ఆగస్టు, 2026 5:50 PM•ByRalin

Share this article

చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 31 వరకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 11(జనవాణి): అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్‌ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పింఛన్ల కోసం ఆగస్టు 31, 2026 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది.

తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

అర్హత ప్రమాణాల్లో మార్పులేదు

కొత్త పింఛన్లకు సంబంధించి అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని ఎలిజిబిలిటీ క్రైటీరియానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటోంది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారమే అర్హతను పరిశీలించనున్నారు.

ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు, ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ధ్రువపత్రాలు తప్పనిసరి

అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్‌ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్‌ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం.

దరఖాస్తుల పరిశీలన అనంతరం నిర్దేశిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపి, జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో పింఛన్‌ మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఆగస్టు 31 వరకు అవకాశం

ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా అర్హత కలిగిన ప్రతి వితంతువు, ఒంటరి మహిళ దరఖాస్తు చేసుకోవడంతోపాటు అవసరమైన ధ్రువపత్రాలు పొందేలా సహకరించాలని సూచించారు.

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31, 2026 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులతోపాటు వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే చేపట్టనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు