హైదరాబాద్ : హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల పోలీస్, రెవెన్యూ, రవాణా తదితర శాఖలకు చెందిన వినియోగంలో లేని ప్రభుత్వ భూములను గుర్తించి, అవసరమైతే ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి వాటిని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం సూచించారు.
జనావాసాలకు దూరంగా ఇళ్లు నిర్మిస్తే ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, లబ్ధిదారులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు తలెత్తవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల ఉద్యోగ, ఉపాధి కేంద్రాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం క్యూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరుపేదల కోసం ఆధునిక సదుపాయాలతో ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించనుంది. ఒక్కో ఫ్లాట్ సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణం, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు.
ప్రతి ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేయగా, అందులో రూ.5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. భూమి కొనుగోలు లేదా కేటాయింపుకు అయ్యే వ్యయాన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ఈ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నియోజకవర్గాల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.




















