నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన సంతాప సందేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
కేసీఆర్ ఆవేదన
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. తానొక ఆప్తమిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడేందుకు పార్టీ చేసిన ప్రయత్నాలు, వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణనే శ్వాసగా భావించి, నీతి, నిజాయితీతో ప్రజా జీవితం కొనసాగించిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ జెండాను బలోపేతం చేస్తూ ఉద్యమానికి నాయకత్వం వహించిన ధీరుడిగా అభివర్ణించారు.
ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలను సైతం ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన సేవలు కార్యకర్తలకు చిరస్మరణీయమని అన్నారు.
పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన కేసీఆర్, ఈ క్లిష్ట సమయంలో కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.




















