నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రెండేళ్లు సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలకు టీచర్లు భాగస్వాములు కావాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.

5 సెప్టెంబర్, 2026 7:23 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నన్ను నమ్మండి...మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌,సెప్టెంబర్ 5 (జనవాణి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రెండేళ్లు సమయం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వ విధానాల్లో టీచర్లు భాగస్వాములు కావాలని, విద్యా రంగంలో సంస్కరణలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

రెండేళ్లు సమయం ఇవ్వండి

ఉపాధ్యాయులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 'రెండేళ్లు సమయం ఇవ్వండి.. పీఆర్సీ, ఇంక్రిమెంట్లతో పాటు అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించే బాధ్యత నాది' అని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులని, వారు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచి సంకేతం కాదని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టవచ్చన్నారు.

CM Revanth | Teachers Day

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు

గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని సీఎం విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేలకు పైగా అడ్మిషన్లు పెరగడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పూర్తి చేశామని, జీవో 317 సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించడంతో పాటు ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపినట్లు వెల్లడించారు.

విద్యా విధానంలో మార్పులు

మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు అవసరమని సీఎం అన్నారు. విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని, పాలిటెక్నిక్ విద్యలోనూ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించి, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

లెక్చరర్లకు భరోసా

పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై వస్తున్న అపోహలను సీఎం ఖండించారు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరే అవకాశంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. లెక్చరర్ల సర్వీస్ రూల్స్ విషయంలోనూ ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. జీతభత్యాలు, పీఆర్సీ, ఇంక్రిమెంట్ల విషయంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

స్కిల్స్, ఇన్నోవేషన్‌పై ఫోకస్

ప్రస్తుత ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. స్కిల్స్ తర్వాత ఇన్నోవేషన్, ఎంప్లాయ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని, తెలంగాణ నుంచి మరిన్ని స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు రావాలని ఆకాంక్షించారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు చెందిన స్కైరూట్ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నాయని ప్రస్తావించారు.

రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు

గతంలో పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో భారీ మొత్తాన్ని తమ ప్రభుత్వం చెల్లించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెండింగ్‌లో పెట్టిందని, తమ ప్రభుత్వం నిధులు సమీకరించి వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించిందని వెల్లడించారు. తెలంగాణ విద్యా రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఉపాధ్యాయులే కీలకమని సీఎం అన్నారు. 'రెండేళ్లు ఫోకస్డ్‌గా పనిచేయండి.. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని సహకరించండి. విధ్వంసం నుంచి తెలంగాణను వికాసం వైపు నడిపిద్దాం' అని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు