స్వాతంత్య్రం వచ్చినప్పుడు నిరక్షరాస్యత, కరవుకాటకాలతో దేశం సతమతమవుతున్నప్పుడు ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విద్యా, నీటిపారుదల రంగాలను తన ప్రాధాన్యాంశాలుగా ఎంచుకొని ఆ సమస్యలను అధిగమించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలు, సాగు నీటి ప్రాజెక్టులు నెహ్రూ దార్శనికతకు నిదర్శనమన్నారు. నాడు వేసిన పునాదులతో నేడు ప్రతి తండా, గూడెంలోనూ పాఠశాలలు ఏర్పాటయ్యాయని, ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
"టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్” కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంసీహెచ్ఆర్డీలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవంతో వైట్ కాలర్ జాబ్‌లను మనం అందిపుచ్చుకున్నామని, కానీ ఇప్పుడు ఆ జాబ్‌లకు కాలం చెల్లిందన్నారు. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఉన్నందున, అక్కడి అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగానే సంప్రదాయ కోర్సులతో ప్రభావం కోల్పోయిన ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో ఏటీసీలుగా ఆధునీకరించామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉట్నూరు ఏటీసీలో శిక్షణ పొందిన వారంతా టాటా సస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని సీఎం తెలిపారు.
కరవు, కాటాకాలు, నిరక్షరాస్యతలో కూరుకుపోయిన దేశాన్ని సాగు నీటి ప్రాజెక్టులు, విద్యాలయాల ఏర్పాటుతో సుభిక్షమైన దేశంగా తీర్చిదిద్దిన నెహ్రూపైనా విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌లను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి, గరిబీ హటావో నినాదంతో పని చేసిన ప్రధానమంత్రి ఇందిరా గాంధీపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి 2014 వరకు ప్రధానమంత్రులుగా చేసిన వారు రూ.51 లక్షల కోట్ల అప్పులు చేస్తే, 2014 నుంచి 2026 వరకు 12 ఏళ్లలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.151 లక్షల కోట్లు అప్పులు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
గోరంత పనులను కొండంత చెప్పుకుంటున్నారని, ఎన్నో యుద్దాలు, కలి, నిరక్షరాస్యతలను అధిగమించిన విజయాలను ఎలా ప్రచారం చేయాలని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ పి.వి.నరసింహారావు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని, తర్వాత కాలంలో అదే నవోదయ విద్యాలయాలకు, గురుకుల పాఠశాలలకు నమూనాగా నిలిచిందన్నారు. ఆ పాఠశాలలో చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా వర్ణించారని, నాడు నిర్మించిన నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ఫలితంగానే తెలంగాణలో ఈనాడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి సాధ్యమైందన్నారు. 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూళేశ్వరం అయిందని విమర్శించారు.
ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడంతో సరిపెట్టుకోకుండా వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనేది తన ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లి వంటి మారుమూల పల్లె ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను తెలంగాణలోని 12 వేల పల్లెల్లోని పాఠశాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు.
కొందరు విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని విమర్శిస్తున్నారని, నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా? ఎందుకు తాను రాజీనామా చేయాలో వాళ్లు తెలపాలని డిమాండ్ చేశారు.
ఓట్ల కోసం, రాజకీయం కోసం తాను పని చేయడం లేదని సీఎం అన్నారు. ప్రపంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ పడాలనేదే తన లక్ష్యమన్నారు. సమాజ మార్పునకే తాను విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి వీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీఆర్‌హెచ్ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





















