హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 311 మందిపై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి. నరేందర్ తెలిపారు.
ఈ తనిఖీల్లో 238 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటో డ్రైవర్లు, 56 కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహన డ్రైవర్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్‌ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా పరిశీలించగా.. 255 మందిలో 36 నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్, 38 మందిలో 201 నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్, 18 మందిలో 301 నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ వరకు ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. నిందితులందరినీ చట్టపరమైన చర్యల్లో భాగంగా కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 3 నుంచి 8 వరకు 283 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఒకరికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 11 మందికి జరిమానాతోపాటు సోషల్ సర్వీస్, 271 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.





















