జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. జగిత్యాల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును సమీక్షించారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్య విద్య, ప్రజారోగ్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం
జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు అన్ని స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. స్పెషాలిటీ సేవలకు జగిత్యాల జీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ సేవలకు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తాయని వివరించారు.
పీజీ కోర్సులకు చర్యలు
జగిత్యాల మెడికల్ కాలేజీలో ప్రధాన వైద్య విభాగాల్లో పీజీ కోర్సులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం నేషనల్ మెడికల్ కమిషన్‌కు వెంటనే దరఖాస్తు చేయాలని వైద్య విద్య డైరెక్టర్‌ను ఆదేశించారు. దీంతో నిపుణులైన వైద్యులు జిల్లాలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
వైద్య సిబ్బంది నియామకాలు
గత రెండున్నర సంవత్సరాల్లో ఆరోగ్యశాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలోని ఆస్పత్రుల కోసం 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే 1,182 పోస్టుల భర్తీ పూర్తైందన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి సహా జిల్లాలోని ఆస్పత్రులకు అవసరమైన వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చారు.
జగిత్యాలలో క్రిటికల్ కేర్ సేవలు
జగిత్యాలలో ఇటీవలే క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే అన్ని రకాల ట్రామా కేర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సరఫరా కోసం అత్యాధునిక సెంట్రల్ మెడిసినల్ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఓపీ, ఐపీ సేవలు మెరుగుపడ్డాయి
జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగిందని, కొత్త ఆస్పత్రి భవనం మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కోరుట్ల ఏరియా హాస్పిటల్‌లో నెలవారీ ప్రసవాల సంఖ్య 550 నుంచి 950కు పెరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వివరించారు. అయితే సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్నాయని, నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేందుకు చర్యలు అవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కోరుట్ల, మెట్‌పల్లి ఆస్పత్రుల్లో సిబ్బంది సంఖ్య పెంచాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
సిజేరియన్లు తగ్గించేందుకు చర్యలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిజేరియన్ డెలివరీల శాతం ఎక్కువగా ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ అందిస్తున్నామని, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నర్సులకు అధికంగా శిక్షణ ఇచ్చి నార్మల్ డెలివరీలను ప్రోత్సహించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.




















