హైదరాబాద్, సెప్టెంబర్ 18 (జనవాణి): ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన.. తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి ఇచ్చారని పేర్కొన్నారు.
జీరో అవర్‌పై దానం నాగేందర్ అసంతృప్తి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మైక్ ఇవ్వడంతో దానం నాగేందర్ తన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రస్తావించే అంశాలకు కేవలం ‘నోట్ చేసుకుంటాం’ అని చెప్పడం కాకుండా, వాటిపై సంబంధిత శాఖల నుంచి సమాధానం రావాలని కోరారు. గతంలో జీరో అవర్‌లో ప్రస్తావించిన అంశాలకు ఎన్ని సమాధానాలు వచ్చాయో పరిశీలించాలని అన్నారు.
మా నియోజకవర్గ ఇళ్లు ఇతరులకు ఎలా?
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తన నియోజకవర్గానికి సుమారు 480 ఇళ్లు కేటాయించారని దానం నాగేందర్ తెలిపారు. అయితే డ్రా నిర్వహించే సమయంలో ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని చెప్పారు. హైదరాబాద్‌లోని పలువురు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉందన్నారు.
తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లలో కార్వాన్, కూకట్‌పల్లి, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యంగా డ్రా నిర్వహించారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులుగా ఉన్న హక్కులను పరిగణనలోకి తీసుకోకపోతే ప్రివిలేజ్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
అధికారుల తీరుపై మండిపాటు
ఎవరి నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను అక్కడి అర్హులైన లబ్ధిదారులకే ఇవ్వాలని దానం నాగేందర్ అన్నారు. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమస్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కొందరు ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ఒకలా, మరికొందరి విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు.
‘కూల్‌గా ఉండటం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా’
తన నియోజకవర్గంలో 360 డిగ్రీల స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపితే ఎక్కడ తప్పిదం జరిగిందో తెలుస్తుందని దానం నాగేందర్ అన్నారు. తప్పిదాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని సంబంధిత మంత్రికి చెబితే ‘కూల్ కూల్’ అంటున్నారని, ప్రభుత్వం కూల్‌గా ఉండటం వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇల్లు లేని వారు ఉండకూడదన్న సీఎం ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను 100 శాతం పూర్తి చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, అధికారులు నిర్లక్ష్యం వీడి బాధ్యతగా వ్యవహరించాలని దానం నాగేందర్ అన్నారు.
Loading Tweet...




















