హైదరాబాద్, ఆగస్టు 29 (జనవాణి): నగరంలో ఖైరతాబాద్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చేలోపే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో శనివారం ఖైరతాబాద్ గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఆయన కార్యక్రమానికి చేరుకునేలోపే అధికారులు డ్రాను ప్రారంభించారు. దీంతో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వేచి చూడకుండా లక్కీ డ్రా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అని పేర్కొంటూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఫ్లాట్ల లక్కీ డ్రా హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో కొనసాగుతోంది. తొలి విడతలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజుల పాటు కొనసాగించనున్నారు.




















