దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో షాక్..పిటిషన్ కొట్టివేత

దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. మరో పార్టీ బీ-ఫారమ్‌పై ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీని వీడినట్లుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. తిరిగి సొంత పార్టీలో చేరినా చట్టసభ సభ్యత్వంపై పడిన అనర్హత స్వయంచాలకంగా తొలగిపోదని పేర్కొంది.

24 సెప్టెంబర్, 2026 2:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో షాక్..పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (జనవాణి): దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం దానం నాగేందర్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. అనర్హత వేటు పడిన నేపథ్యంలో తిరిగి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

బీ-ఫారమ్‌పై పోటీ చేస్తే పార్టీ వీడినట్టే

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా, అధికారికంగా రాజీనామా లేఖ సమర్పించకపోయినా.. మరో రాజకీయ పార్టీ బీ-ఫారమ్‌పై నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగపరంగా పార్టీని వీడినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు స్పీకర్ చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనకు దారితీస్తుందని తెలిపింది.

‘ఘర్ వాపసీ’ వాదనను ప్రస్తావించిన రోహత్గీ

దానం నాగేందర్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ దానం తిరిగి తన సొంత పార్టీలో చేరారని, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయనపై పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని, అందువల్ల అనర్హత వేటు అవసరం లేదని వాదించారు.

అయితే దీనిపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం వేరు, చట్టసభ సభ్యత్వాన్ని కొనసాగించడం వేరు అని ధర్మాసనం పేర్కొంది. తిరిగి పార్టీలో చేరినంత మాత్రాన చట్టసభ సభ్యత్వంపై పడిన అనర్హత తొలగిపోదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఆయన పిటిషన్‌కు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించలేదు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు