హైదరాబాద్, ఆగస్టు 17 (జనవాణి): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ పాలన, రాజకీయ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది కేసీఆర్‌లు కాదు రేవంత్ రెడ్డీ.. నిన్ను, కాంగ్రెస్ పార్టీని బొగ్గుపాలు చేయడానికి నువ్వు ఒక్కడివే చాలు అంటూ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. రేవంత్ అడ్డూ అదుపులేని అవినీతి, నిరంకుశత్వం, ఆధిపత్య అహంకారమే ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారుతాయని అన్నారు. కేసీఆర్ వచ్చి రేవంత్‌ను ముట్టుకోవాల్సిన అవసరమే లేదని.. తన నోటి దురుసు, అహంకారం, అసమర్థ పాలనతో రేవంత్ తనను తాను, తన కాంగ్రెస్ పార్టీని నష్టపరుచుకుంటున్నారని ఆరోపించారు.
32 నెలల పాలనపై ప్రశ్నలు
రేవంత్ రెడ్డి 32 నెలల్లో సెలవు తీసుకోలేదని చెప్పుకుంటున్నారని దాసోజు అన్నారు. అయితే ఈ కాలంలో తెలంగాణ ప్రజలకు ఏమి మేలు జరిగిందని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, రైతుభరోసా పరిస్థితి ఏమిటో తెలియడం లేదని, ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా అబద్ధాలంటూ తప్పించుకోవడం ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ ఆరోపణలు
బోల్తా పడ్డ బండిని పట్టాలెక్కించినం అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని దాసోజు విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండే పచ్చగా ఉన్న తెలంగాణను ఆగమాగం చేశారని, పెట్టుబడులు రాకుండా చేశారని, రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. యువతను రోడ్లపైకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారని, ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది రేవంత్ ప్రభుత్వమేనని ఆరోపించారు.
ప్రజల ముందు నిలబడే ధైర్యం ఉందా?
సామాజిక న్యాయం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టి, పదవుల పంపకాల్లో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్‌లో అసెంబ్లీలో తేల్చుకుందామని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసురుతున్నారని గుర్తుచేస్తూ.. అసెంబ్లీ వరకు ఎందుకు, సెక్యూరిటీ లేకుండా పల్లెల్లోకి వెళ్లి ప్రజల ముందు నిలబడే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో దాన్ని పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ పేరును రేవంత్ ప్రస్తావిస్తున్నారని దాసోజు ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని ఆయన అన్నారు. అబద్ధాల పునాదులపై నిర్మించిన ప్రచార కోటలు, పాలనా వైఫల్యాలు ఎంతోకాలం దాగవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావడం ఖాయమంటూ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.




















