హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పోలీసులు దురుసుగా కానీ అసభ్యంగా ప్రవర్తించలేదని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సూచనల మేరకే పోలీసులు విధులు నిర్వహించారని తెలిపారు.
నల్ల టీషర్టులతో రావడంపై అభ్యంతరం
నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడం నేరం కాదని డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు ధరించిన టీషర్టులపై అసభ్యకర పదాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతో వారిని లోపలికి అనుమతించలేదని చెప్పారు. గేట్ నంబర్ 3 వద్ద వారిని అదుపులోకి తీసుకుని బీఆర్ఎస్ భవన్కు తరలించినట్లు వివరించారు. బీఆర్ఎస్ సభ్యులతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అలాంటి ఘటన ఏదైనా జరిగిందని ఆరోపిస్తే వీడియోలను పరిశీలిస్తామని డీసీపీ తెలిపారు. బనియన్తో అసెంబ్లీలోకి ఎలా వెళ్తారని ఆమె ప్రశ్నించారు.
సునీతా లక్ష్మారెడ్డి ఆరోపణలపై క్లారిటీ
అసెంబ్లీకి నలుపు రంగు చీర ధరించి వెళ్తున్న తన చీరను పోలీసులు లాగారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ.. తాము తమ డ్యూటీ చేశామని చెప్పారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా... అలాంటిదేమీ లేదని చెప్పారు. అలాంటి ఘటన ఏదీ జరగలేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించవచ్చని తెలిపారు.
హరీశ్ రావు, కేటీఆర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తమ టీషర్టులను విప్పి బనియన్తో అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. హరీశ్ రావు బనియన్తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షాలను అసెంబ్లీలోకి అనుమతించకుండా సమావేశాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతకాలం పాలన సాగిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించారు. అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో కేటీఆర్కు స్వల్ప గాయాలయ్యాయని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కూడా తోపులాటలో కిందపడినట్లు సమాచారం.




















