జనగామ జిల్లా, సెప్టెంబర్ 01 (జనవాణి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే 1000 రోజులు గడిచినా హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
420 హామీలను గుర్తుచేసేందుకే ప్రతి గ్రామంలో ‘బాకీ కార్డులు’ పంపిణీ చేసి ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ పడిందో వివరిస్తున్నామని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు పథకాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు డిక్లరేషన్, రైతు భరోసా, పంటలకు రూ.500 బోనస్, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఎర్రబెల్లి ఆరోపించారు.
1000 రోజుల పాలనలో రాష్ట్రానికి మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. పాలనను పక్కనపెట్టి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు, తుపాకీ రాముడి మాటలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో తనను పోల్చుకోవడం అంటే నందితో పందిని పోల్చినట్టేనని ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాక విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక రిబ్బన్ కట్టింగ్ ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేయడం తమకు కొత్త కాదన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో పాటు యువజన, సోషల్ మీడియా విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





















