గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లు ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు సంక్షేమ చట్టం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో యూనియన్‌ ప్రతినిధులు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

7 ఆగస్టు, 2026 7:45 PM•ByRalin

Share this article

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులతో మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనవాణి): రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లు ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు సంక్షేమ చట్టం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో యూనియన్‌ ప్రతినిధులు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సమస్యలపై శుక్రవారం సచివాలయంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జి. వివేక్‌ వెంకటస్వామి యూనియన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లు, సంక్షేమం, సామాజిక భద్రత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ, గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రత్యేక గిగ్‌ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

ఆ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని, వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని వెల్లడించారు. యూనియన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అన్ని డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే వరకు గిగ్‌ వర్కర్లు, యూనియన్లు ఓపికగా ఉండాలని కోరిన మంత్రి, కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

మంత్రి హామీలపై సంతృప్తి వ్యక్తం చేసిన గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల యూనియన్‌ ప్రతినిధులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ శనివారం నుంచి చేపట్టాల్సిన సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. గిగ్‌ కార్మికుల సంక్షేమానికి తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థంగా అమలు చేసి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సమావేశంలో కార్మికశాఖ అదనపు కమిషనర్‌ గంగాధర్‌, రవాణా శాఖ అధికారులు, గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ యూనియన్‌ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు