హైదరాబాద్/భద్రాచలం, జనవాణి: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి 53 అడుగుల మార్క్‌ను దాటిన నదీ నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే సమయంలో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భద్రాచలం వద్ద వరద ఉధృతి
గోదావరి ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల పరిసర ప్రాంతాల్లో అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వాగులు, వంతెనలు దాటకుండా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
నీటమునిగిన పర్ణశాల
వరద ఉధృతి కారణంగా దుమ్ముగూడెం–భద్రాచలం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోగా, సీతవాగు ప్రాంతంలో సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి వరదలో కనుమరుగయ్యాయి. తూరుబాక హై లెవల్ వంతెన అప్రోచ్ రోడ్లు కోతకు గురికావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
ఇసుక క్వారీలో చిక్కుకున్న 44 మంది రక్షణ
చర్ల మండలంలోని వీరాపురం ఇసుక క్వారీలో వరద నీరు ఒక్కసారిగా చేరడంతో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లు, కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ రక్షణ చర్యల్లో పాల్గొన్న పోలీసు అధికారులు సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి వరదలో జారిపడినా ఈదుకుంటూ తిరిగి తెప్పపైకి చేరడంతో ప్రమాదం తప్పింది.
థర్మోకోల్ తెప్పపై గర్భిణి తరలింపు
అశ్వాపురం మండలంలో బట్టీలగుంపు–రామ్‌నగర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో గర్భిణిని థర్మోకోల్ తెప్ప సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరో ఐదు రోజులు వర్షాలే
వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారినప్పటికీ, దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
గత 24 గంటల్లో మంచిర్యాల జిల్లా తపాల్‌పూర్‌లో అత్యధికంగా 16.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్‌లో 15.3 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా వెల్గటూరు, కోల్వాయిలో 15 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
వర్షపాతం లోటు దాదాపు భర్తీ
గత పది రోజుల వర్షాలతో రాష్ట్ర సగటు వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. జూన్ 1 నుంచి జులై 31 వరకు సాధారణంగా 349.9 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, ఈసారి 332.3 మిల్లీమీటర్లు నమోదై కేవలం 5 శాతం లోటు మాత్రమే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో సాధారణం కంటే 52 శాతం అధిక వర్షపాతం నమోదవగా, యాదాద్రి జిల్లాలో 47 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
గోదావరి వరదల నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, వరద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు శనివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులతో పాటు పెద్దపల్లి జిల్లాలోని పార్వతి పంపుహౌస్‌ను సందర్శించనున్నారు.




















