తిరుమల, జూలై 14:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని 72 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, భద్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు డొనేషన్ స్కీంలో కీలక మార్పులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర వివరాలు వెల్లడించారు.
డొనేషన్ స్కీంలో మార్పులు
డొనేషన్ స్కీంను భక్తులకు మరింత ఆమోదయోగ్యంగా మార్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనంలో అధిక ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దాతలకు ఉన్న ప్రత్యేక దర్శన (డోనర్స్ ప్రివిలేజెస్) సౌకర్యాలను తగ్గించినట్లు చెప్పారు. ఈ కొత్త విధానం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
భక్తుల కోసం కొత్త సౌకర్యాలు
తిరుమలలోని ఏటీసీ వద్ద రూ.6.31 కోట్లతో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల కోసం శాశ్వత క్యూ లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. కుమారధార, పసుపుధార ప్రాంతాల్లో రూ.2.77 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా జీఎన్‌సీ వద్ద 800 కిలోవాట్ల విండ్‌మిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మ్యూజియం, భద్రతకు ప్రాధాన్యం
ఎస్‌వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన వారికి రూ.50 ప్రవేశ రుసుము నిర్ణయించారు. మ్యూజియం నిర్వహణను టాటా సంస్థకు అప్పగించే ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. టీటీడీ ఆలయాల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం రూ.2.35 కోట్లతో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
అభివృద్ధి పనులకు ఆమోదం
కాకుల మానుకొండ వద్ద పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపుకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఏటీసీ, టీబీసీ ప్రాంతాల్లో పాత భవనాలను తొలగించి దాతల సహకారంతో కొత్త భవనాలు నిర్మించనున్నారు. 2027 డైరీలు, క్యాలెండర్ల ముద్రణ టెండర్లకు కూడా ఆమోదం తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి నిధులు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి బంగారు కవచం తయారీ కోసం ఒక కిలో బంగారం ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడే రూ.17.86 కోట్లతో 100 గదుల నిర్మాణం, రూ.2.11 కోట్లతో మాడవీధుల విస్తరణకు ఆమోదం తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2.5 కోట్లు కేటాయించారు.

వేదపండితుల నియామకాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్య పారాయణం కోసం 791 మంది వేదపండితుల పోస్టుల భర్తీకి పాలకమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే డీపీపీ కళాకారుల వేతనాల పెంపు, క్యాటరింగ్ సిబ్బందికి పదోన్నతుల అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంది.
టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయాల్లో ముఖ్యంగా డొనేషన్ స్కీంలో మార్పులు చేసి, సామాన్య భక్తులకు దర్శనంలో మరింత ప్రాధాన్యం కల్పించడం విశేషంగా నిలిచింది.




















