జనవాణి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ, వాటిని వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు.
'క్షుద్ర పూజలు' వ్యాఖ్యలపై అభ్యంతరం
హరీశ్ రావు తరఫు న్యాయవాది పంపిన లీగల్ నోటీసుల ప్రకారం, కాంగ్రెస్ నేతలు తనపై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా, "రాష్ట్రంలో వర్షాలు పడకూడదనే ఉద్దేశంతో దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ" చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రతిష్ఠ దెబ్బతీయాలనే కుట్ర?
ఎన్నో సంవత్సరాలుగా ప్రజాజీవితంలో మచ్చలేని పేరు సంపాదించుకున్న హరీశ్ రావు ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో ఆరోపించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసే లక్ష్యంతోనే ఈ ప్రచారం నిర్వహించారని న్యాయవాది పేర్కొన్నారు.
పుట్టినరోజులు, మొక్కులు వంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళ్లడం భారతీయ సంప్రదాయంలో భాగమని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిగత భక్తి కార్యక్రమాలను వక్రీకరించి రాజకీయ ఆరోపణలకు ఉపయోగించడం దేవాలయాల పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా భక్తుల మనోభావాలను కూడా గాయపరుస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకేనన్న ఆరోపణ
రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై తాము ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని హరీశ్ రావు తరఫు నోటీసుల్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ కక్షతో చేసినవేనని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
క్షమాపణతో పాటు వీడియోలు తొలగించాలి
తమపై చేసిన ఆరోపణలను ఏ వార్తా ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలు లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచారం చేశారో, అదే వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో కోరారు. అలాగే సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్, ఇతర డిజిటల్ లేదా ప్రింట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న సంబంధిత వీడియోలు, పోస్టులు, కంటెంట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
స్పందించకపోతే చట్టపరమైన చర్యలు
నిర్ణీత గడువులోగా ఆరోపణలు వెనక్కి తీసుకోకపోయినా, క్షమాపణ చెప్పకపోయినా, సంబంధిత కంటెంట్ తొలగించకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు తరఫు న్యాయవాది హెచ్చరించారు. సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేయాల్సి వస్తుందని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధిత కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.




















