హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనవాణి): హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లగ్జరీ చాక్లెట్ ప్యాకెట్ల ముసుగులో తరలిస్తున్న సుమారు రూ.24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులకు అందిన నిఘా సమాచారంతో దోహా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. విమానం దిగిన అనంతరం టెర్మినల్ వైపు వెళ్తున్న అతడిని అదుపులోకి తీసుకుని బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
బరువులో తేడాతో బయటపడిన అసలు విషయం
తనిఖీల్లో ప్రయాణికుడి బ్యాగులో ఏడు 'లిండ్ లిండోర్' (Lindt Lindor) డార్క్ చాక్లెట్ బాక్సులు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా ఒక్కో ప్యాకెట్ బరువు సుమారు 387 గ్రాములు ఉండాల్సి ఉండగా, వాటి బరువులో తేడాను అధికారులు గుర్తించారు. దీంతో అనుమానం మరింత బలపడటంతో చాక్లెట్ ప్యాకెట్లను తెరిచి పరిశీలించారు. అప్పుడు వాటి లోపల దాచిన లేత పసుపు రంగు క్యాప్సూల్స్ బయటపడ్డాయి.
207 క్యాప్సూల్స్‌లో కొకైన్
మొత్తం 207 క్యాప్సూల్స్‌ను అధికారులు గుర్తించారు. వాటిలో తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న పదార్థాన్ని ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌తో పరీక్షించగా అది కొకైన్‌గా నిర్ధారణ అయింది. అధికారుల ప్రకారం స్వాధీనం చేసుకున్న కొకైన్ మొత్తం బరువు 4.9 కిలోలు. దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ.24.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
NDPS చట్టం కింద కేసు
కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు నిందితుడిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో ఎవరికి అందించాల్సి ఉంది? ఈ స్మగ్లింగ్ వెనుక మరెవరైనా ఉన్నారా? అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో నిందితుడికి ఉన్న సంబంధాలేంటి? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Loading Tweet...




















